సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి నోటీసులు

Visakha Co operative bank Issued Notices to Sabbam Hari - Sakshi

బకాయిలు ఎగవేసారంటూ విశాఖ కో ఆపరేటివ్‌ బ్యాంకు తాఖీదులు

వడ్డీ సహా పేరుకుపోయిన బకాయిలు రూ.9.54 కోట్లు

డక్కన్‌ క్రానికల్‌ భవనం వేలం వివాదం

సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి మాజీ ఎంపీ, విశాఖ మాజీ మేయర్‌ సబ్బం హరి ఆస్తుల స్వాధీనానికి విశాఖ కో ఆపరేటివ్‌ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. వాయిదాలు చెల్లించకపోవడంతో ఎన్‌పీఏ జాబితాలో చేర్చిన బ్యాంకు ఆర్‌బీఐ నిబంధనల మేరకు మంగళవారం ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. బకాయిలను 60 రోజుల్లోగా చెల్లించకపోతే సీతమ్మధారలోని 1622 చదరపు గజాల స్థలంలోని నివాసంతో పాటు మాధవధారలోని వుడా లేఅవుట్లో 444.44 చదరపు అడుగుల విస్తీర్ణంలోని  విష్ణు వైభవం అపార్టుమెంట్, విశాఖ బీచ్‌రోడ్‌లోని రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది.

ఇదీ నేపథ్యం..
నగరం నడిబొడ్డున మద్దిలపాలెంలో ఉన్న డక్కన్‌ క్రానికల్‌ భవనాన్ని 2014లో కోటక్‌ మహేంద్ర వేలం వేసింది. ఆ వేలంలో రూ.17.80 కోట్లకు సబ్బం హరి పాడుకున్నారు. ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో–ఆపరేటివ్‌ బ్యాంకు నుంచి రూ.8.50 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డక్కన్‌ క్రానికల్‌ (డీసీ) యాజమాన్యం డెబిట్‌ రికవరీ అపిలేట్‌ అథారిటీ (డీఆర్‌ఏపీ)లో కేసు ఫైల్‌ చేసింది. అథారిటీ డీసీ వాదనను సమర్ధిస్తూ వేలం రద్దు చేయాలని, సబ్బం హరి డిపాజిట్‌ చేసిన రూ.17.80 కోట్లను వడ్డీ సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై కోటక్‌ మహేంద్ర అప్పీల్‌కు వెళ్లింది. మరో వైపు ఈ కేసును జాతీయ స్థాయిలో ఏర్పాటైన నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ (ఏసీఎల్‌టీ)కి రిఫర్‌ చేశారు. దీనిపై తుది తీర్పు రావాల్సి ఉంది.


విశాఖ కో ఆపరేటివ్‌ బ్యాంకులో తనఖా పెట్టిన సీతమ్మధారలోని సబ్బం హరి నివాసం ఉంటున్న ఇల్లు

చెల్లింపులో ఎలాంటి సందేహం లేదు
రూ.60 కోట్ల ఆస్తులను కొలాట్రల్‌ సెక్యురిటీ పెట్టి కో ఆపరేటివ్‌ బ్యాంకులో రూ.8.50 కోట్ల రుణం తీసుకున్నా. రూ.1.50 కోట్ల వరకు తిరిగి చెల్లించా. వడ్డీ సహా రూ.9.54 కోట్లు చెల్లించాలని బ్యాంకు నోటీసు ఇచ్చింది. డక్కన్‌ క్రానికల్‌ కేసులో తుది తీర్పు వెలువడగానే బ్యాంకు వాళ్లకు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీ సహా కోటక్‌ మహేంద్రాయే నేరుగా చెల్లిస్తుంది. ఈ రుణ బకాయిల చెల్లింపు విషయంలో సందేహ పడాల్సిన పనిలేదు.
 – సబ్బం హరి, మాజీ ఎంపీ

నిబంధనల ప్రకారమే నోటీసులు
బకాయిలు వసూలు కాకపోవడం వల్లే సబ్బం హరి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఉపక్రమించాం. తుది తీర్పు వెలువడగానే సబ్బం హరి రుణాన్ని వడ్డీ సహా సెటిల్‌ చేస్తామని కోటక్‌ మహేంద్ర లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఎదురు చూశాం. తుది తీర్పు ఎప్పుడొస్తుందో తెలియడం లేదు.  అందువల్లే  నోటీసులు జారీ చేశాం.    
 – మానం ఆంజనేయులు,చైర్మన్, విశాఖ కో ఆపరేటివ్‌ బ్యాంకు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top