300 ఎకరాల ఆయకట్టుకు ఎసరు

Villagers Complained To Tahsildar Against Who Occupied Land Illegally In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం(చీపురుపల్లి) : ఆయనో పెద్ద భూ స్వామి... పదుల ఎకరాల భూమి ఉంది... ఇంకా ఆయనకు భూ దాహం తీరలేదు. శ్రీకాకుళం జిల్లా నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో.. తన పొలం మధ్యలో ఉన్న గెడ్డలు, వాగులు..రస్తాలను కలిపేశారు. ఒకే పొలంగా మార్చేశారు... అందులో చక్కగా మొక్కజొన్న సాగు చేపట్టారు. చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ గెడ్డ ఆక్రమణ పుణ్యమా అని దాదాపు 300 ఎకరాల ఆయకట్టుకు నీరందడంలేదు. గెడ్డను విడిచిపెట్టాలని భూస్వామి రైతులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్‌కు గోడు వినిపించారు. 

2.69 ఎకరాల ఆక్రమణ
శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలంలోని లింగాలవలస, వెంకటాపురానికి  చెందిన టీడీపీ నేతల సమీప బంధువు కర్లాం రెవెన్యూ పరిధిలో 18 ఎకరాలు జిరాయితీ పొలాన్నీ ఇటీవల కొనుగోలు చేశారు. ఆ జిరాయితీ పొలానికి చుట్టూ సర్వే నంబరు 302–1లో 2.41 ఎకరాల  విస్తీర్ణంలోని గెడ్డ, 302–4 లో 0.28 సెంట్లు రస్తా ఉండేది. జిరాయితీ పొలం చుట్టూ ఉన్న ఈ గెడ్డ, రస్తాను భూస్వామి ఆక్రమించినట్టు గ్రామస్తులు,పెద్దలు ఆరోపిస్తున్నారు.  దీంతో ఈ గెడ్డ నుంచి వచ్చే నీరు పోలమ్మ చెరువుకు చేరుతుందని, ఆ చెరువు కింద 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని గ్రామ పెద్దల వాదన. అయితే, లావేరు మండలంలో ఉన్న టీడీపీ నాయకుడు తన దగ్గర నారాయణ మంత్రం ఉందని, అంతా తాను చూసుకుంటానని దగ్గరుండి కర్లాం రెవెన్యూ పరిధిలో భూములు కొనిపించి, ఆక్రమణకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

తహసీల్దార్‌కు ఫిర్యాదు 
కర్లాం రెవెన్యూ పరిధిలో వాగు, రస్తా ఆక్రమణకు గురైందని, దీనివల్ల పోలమ్మ చెరువుకు నీరు సరఫరా నిలిచిపోయిందని గ్రామ పెద్దలు తహసీల్దార్‌ శ్యామ్‌సుందర్‌కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల 300 ఎకరాల ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని వివరించారు.

సర్వేకు ఆదేశించాం
ఇదే విషయంపై తహసీల్దార్‌ పి.వి.శ్యామ్‌సుందర్‌ మాట్లాడుతూ కర్లాంలో గెడ్డ, రస్తా ఆక్రమణలపై ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిపై మండల సర్వేయర్, ఆర్‌ఐలకు సర్వే చేసి వాస్తవ నివేదికలను ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఆక్రమణలకు గురైనట్లు తేలితే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top