
ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: ఎన్నో సంక్షేమ ఫలాలను పేదలకు అందించిన మహనీయుడు.. ముఖ్యమంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తులు.. రైతులకు దగ్గర చుట్టం.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. నేడు ఆయన 71వ జయంతి సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. "ఒక్క సంతకంతో పేదవాడి జీవితంలో వెలుగు నింపవచ్చు, రోడ్డు మధ్యలో ఆగిపోతున్న ప్రాణాలను 108తో కాపాడవచ్చు. పేదవారికి రెండు రూపాయలతో కడుపు నింపవచ్చు. ఉచితంగా కార్పొరేట్ విద్యా, వైద్యం అందించవచ్చు, జలయజ్ఞంతో ప్రతి ఎకరా సాగు చెయ్యొచ్చు అని నిరూపించిన దేవుడు వైఎస్సార్" అని ట్విటర్‌లో రాసుకొచ్చారు.
"రైతు బాంధవుడు వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తండ్రీకొడుకులకు ప్రజలంటే అంతులేని ప్రేమ. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్సార్. పేదల పక్షపాతిగా నిలిచిన ఆయన 71వ జయంతిని ఘనంగా జరుపుకుందాం.. ఆయన సేవలను మననం చేసుకుందాం" అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. "తెలుగు నేల ఉన్నంతవరకు మాత్రమే కాదు.. సూర్యచంద్రులు ఉన్నంతవరకు ప్రతి పేదోడి గుండెల్లో వైఎస్సార్ చిరంజీవుడే" అంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ట్విటర్‌లో రాసుకొచ్చారు. కాగా వైఎస్సార్ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. (10 అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహం)