భూకంప ముప్పులో బెజవాడ!

Vijayawada Is In Earth Quake Threat - Sakshi

ఈఈఆర్‌సీ, ఈడీఆర్‌ఐ నివేదిక వెల్లడి 

158 ఏళ్లలో 170 భూకంపాలు, ప్రకంపనలు

భారీ కట్టడాలు, బహుళ అంతస్తులు వద్దని హెచ్చరిక

సాక్షి, అమరావతి : బెజవాడ భూకంప ముప్పు ప్రభావిత ప్రాంతంలో ఉంది. అంతేకాదు.. విజయవాడకు సమీపంలో ఉన్న రాజధాని అమరావతి ప్రాంతంపై కూడా ఈ భూకంప ప్రభావం ఉండనుంది. ఈ విషయం ఎర్త్‌క్వేక్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చి సెంటర్‌ (ఈఈఆర్‌సీ), ఎర్త్‌క్వేక్‌ డిజాస్టర్‌ రిస్క్‌ ఇండెక్స్‌ (ఈడీఆర్‌ఐ)ల సంయుక్త నివేదికలో తాజాగా వెల్లడయింది. దేశంలో అత్యధికంగా భూకంపాలకు గురయ్యే 50 పట్టణాల్లో విజయవాడ కూడా ఉందని పేర్కొంది. విజయవాడ నగరం కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉండడం, భూకంపాలకు ఆస్కారమిచ్చే నేల స్వభావం ఉండడం, బోర్ల వినియోగం అధికం కావడం వంటి కారణాలు భూకంప ముప్పుకు దోహదం చేస్తున్నాయని తేల్చింది. మున్ముందు భారీ కట్టడాలు, ఆకాశ హార్మోమ్యలతో ప్రమాద తీవ్రత అధికమయ్యే అవకాశం ఉందని, అందువల్ల అలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించింది. తాజా నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం విజయవాడ.. భూకంప ప్రభావిత (సెస్మిక్‌) మండలాల జోన్‌–3 పరిధిలో ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న బెజవాడ సముద్ర మట్టానికి 39 అడుగుల ఎత్తులో ఉంది. విజయవాడ పరిసరాల్లోని 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున లోపభూయిష్టమైన నియో టెక్టానిక్‌ ప్లేట్లు విస్తరించి ఉన్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) ఇదివరకే గుర్తించింది.

భూకంపాలకు నేల స్వభావం ఎక్కువ కారణమవుతుంది. విజయవాడ ప్రాంతంలో 58 శాతం భూమి నల్ల పత్తి నేలతోపాటు బంకమట్టి, ఇసుక, ఒండ్రుమట్టి కలిగిన తేలికపాటి నేల స్వభావం ఉంది. వీటిలో దక్షిణ ప్రాంతాల్లో బంకమట్టి 2 నుంచి 8 మీటర్లు, తూర్పు ప్రాంతంలో 5 నుంచి 8 మీటర్ల లోతు వరకు ఉంది. భూగర్భంలో నగరానికి ఉత్తర, పశ్చిమాల్లో క్రిస్టల్‌ లైన్, ఈశాన్యంలో గోండ్వానా, సాండ్‌ స్టోన్స్, కోస్టల్‌ అల్లూవియల్‌ (తీర ఒండ్రు) రకం రాళ్లున్నాయి. నగర పరిధిలో కానూరు, ఎనికేపాడు వంటి ప్రాంతాల్లో బోరుబావులు అవసరానికి మించి (15–20 మీటర్ల దిగువకు) తవ్వారు. ఇవన్నీ వెరసి విజయవాడను భూకంప ప్రభావిత జాబితాలో చేర్చాయి. భూకంపం వస్తే కృష్ణా నదికి దక్షిణాన ఉన్న మంగళగిరి, తూర్పు వైపున ఉన్న పోరంకి వరకు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని గుర్తించారు. పర్యావరణ సమతుల్యత పాటించని పక్షంలో విజయవాడలో భవిష్యత్తులో ఏటా భూకంపాల ఆస్కారం ఉందని హెచ్చరించారు. 

6 మ్యాగ్నిట్యూడ్‌లు దాటితే పెనుముప్పు
విజయవాడలో తొమ్మిది వేలకు పైగా అపార్ట్‌మెంట్లున్నాయి. ఇవి మూడు నుంచి తొమ్మిది అంతస్తుల్లో నిర్మించి ఉన్నాయి. భూకంపం సంభవించినప్పుడు రిక్టర్‌ స్కేల్‌పై 6 మ్యాగ్నిట్యూడ్‌లకు మించి తీవ్రత నమోదైతే వీటిలో 80 శాతం బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలతోపాటు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతుంది. అయితే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఢిల్లీ, పాట్నా నగరాలకంటే మన బెజవాడ ఒకింత సేఫ్‌ జోన్‌లోనే ఉందని ఈఈఆర్‌సీ, ఈడీఆర్‌ఐల నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. 

బెజవాడలో 170 వరకు భూకంపాలు
విజయవాడ పరిసరాల్లో 1861 నుంచి ఇప్పటిదాకా 170 వరకు భూకంపాలు/ ప్రకంపనలు సంభవించినట్టు వివిధ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇందులో రిక్టర్‌ స్కేల్‌పై 3.7 నుంచి 6 మ్యాగ్నిట్యూడ్‌ల వరకే నమోదైంది. అయితే వీటిలో తేలికపాటి ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం వాటిల్లలేదు.

బెజవాడలో వచ్చిన భూకంపాల్లో కొన్ని.. 

ఎప్పుడు రిక్టర్‌ స్కేల్‌
జులై 1861 3.7
జనవరి 1862 3.7
జూన్‌ 1984 3.0
మే 2009 6.0
మే 2014 6.0
ఏప్రిల్‌ 2015 5.0
మే 2015 5.0

ఇవీ సూచనలు.. 
భవిష్యత్‌లో విజయవాడలో భూకంపాలు సంభవిస్తే ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఈఈఆర్‌సీ, ఈడీఆర్‌ఐ నిపుణులు సూచించారు. అవి..
►భూకంప తీవ్రతను తట్టుకునే ఆధునిక సాంకేతికతతో భవన నిర్మాణాలు చేపట్టాలి.
► బహుళ అంతస్తుల నిర్మాణాలను నిలువరించాలి.
► బోర్ల తవ్వకాలను నియంత్రించాలి. 
► దీనిపై స్థానిక సంస్థలు, బిల్డర్లు, పరిశోధకులు బాధ్యత తీసుకోవాలి. 
► సంబంధికులకు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అవగాహన పెంచాలి.
► డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ ప్లాన్‌ను కార్యాచరణలోకి తేవాలి.       

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top