తారు అక్రమ వ్యాపారంపై విజిలెన్స్‌ దాడులు | Sakshi
Sakshi News home page

తారు అక్రమ వ్యాపారంపై విజిలెన్స్‌ దాడులు

Published Fri, Jan 11 2019 7:24 AM

Vigilance Attack on Asphalt Business in Vizianagaram - Sakshi

విజయనగరం గంటస్తంభం: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అక్రమంగా సాగుతున్న తారు, అయిల్‌ వ్యాపారాలపై శ్రీకాకుళం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు చేశారు. అక్రమ వ్యాపారం చేస్తున్న వారి నుంచి రూ.2.20 లక్షల విలువ గల తారు స్వాధీనం చేసుకుని యజమానులపై కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారికి అందిన సమాచారం మేరకు ఆ విభాగం అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు కలిసి బొండపల్లి మండలం నెలివాడ వద్ద సేరం శ్రీనివాసరావుకు చెందిన వివేకానంద ఇండస్ట్రియల్‌ అయిల్స్‌పై దాడులు చేశారు. వారి వద్ద నుంచి 28 బారెల్స్‌ బిటుమన్‌ తారు (5600 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. వీటి  విలువ రూ.1,12,000 ఉంటుందని గుర్తించారు.

విజయనగరం రూరల్‌ మండలం కొండకరకాం పరిధిలో జేఎన్‌టీయూ రోడ్‌ వద్ద అనకాపల్లికి చెందిన మల్ల రవికుమార్‌ అక్రమంగా నిల్వ చేసిన రూ.66 వేల విలువ చేసే 23 బారెల్స్‌ బిటుమన్‌ తారు (4600 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. దత్తిరాజేరు మండలం తాడెందొరవలస వద్ద ఉన్న ఉల్లి వీరబాబు అక్రమంగా నిల్వ చేసిన రూ.40 వేల విలువ చేసే 2000 లీటర్ల తారును సీజ్‌ చేశారు. ముగ్గురు యజమానులు హైవేపై వెళ్తున్న ట్యాంకర్‌ డ్రైవర్లకు డబ్బులిచ్చి తారు సేకరిస్తున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ విషయమై అధికారులు వ్యాపారులను ప్రశ్నించగా.. తక్కువ డబ్బులకు డ్రైవర్ల వద్ద తారు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. బిటుమన్‌ తారు అన్నది పెట్రోలియం ఉత్పత్తి కావడంతో వాటిని నిల్వ చేయడం, లైసెన్స్‌ లేకుండా అమ్మడం నేరంగా పరిగణించి వారిపై సీఎస్‌డీటీలతో ఏపీ పెట్రోలియం ప్రొడక్టŠస్‌ ఆఫ్‌ సప్‌లై అర్డర్‌ 1980ను ఉల్లంఘంచినందుకు గాను సెక్షన్‌ 6ఏ కేసుతో పాటు 7 కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేయించారు. తనిఖీల్లో ప్రాంతీయ నిఘా అమలు అధికారి టి. హరికృష్ణ పర్యవేక్షణలో డీఎస్పీ కె. భార్గవరావునాయుడు, డీఎస్పీ శ్రీకృష్ణ, సీఐ తారకరామారావు, డీసీటీఓ సూర్యత్రినాథరావు,  అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement