సత్వర న్యాయం కోసమే వీడియో కాన్ఫరెన్స్ | Video conferencing for quick justice | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయం కోసమే వీడియో కాన్ఫరెన్స్

Feb 13 2016 1:49 AM | Updated on Apr 6 2019 9:01 PM

క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికి కోర్టు ఆవరణలో

హైకోర్టు జడ్జి జస్టిస్ అఫ్జల్‌పుర్కర్
 
తిరుపతి లీగల్: క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికి కోర్టు ఆవరణలో వీడియోకాన్ఫరెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జడ్జి, చిత్తూరు జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ విలాస్‌రావ్ అఫ్జల్‌పుర్కర్ తెలిపారు. తిరుపతి కోర్టు ఆవరణలో శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై వీడియో కాన్పరెన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఓ హత్య కేసుకు సం బంధించి తిరుపతి సబ్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న పి.దిల్‌షాన్ అలియాస్ దిల్ అనే మహిళకు సంబంధించిన సెషన్స్ కేసులో  వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆమెను న్యాయమూర్తి విచారించారు. ఆమెకు న్యాయవాదిని నియమించుకునే ఆర్థికశక్తి లేకపోవడంతో ప్రభుత్వం తరపున పి.రవి అనే న్యాయవాదిని నియమి స్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జూనియర్ జడ్జిల కోర్టుల్లోని కేసుల్లో నిందితులై, జైల్లో రిమాండ్‌లో ఉన్న ఖైదీలతో న్యాయమూర్తి వీడియో కాన్సరెన్స్ ద్వారా మాట్లాడారు. కార్యక్రమం అనంతరం హైకోర్టు న్యాయమూర్తి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హై కోర్టు జడ్జి మాట్లాడుతూ ప్రస్తుతం న్యాయశాఖలోని అన్ని విభాగాలను కంప్యూటరైజేషన్ చేస్తున్నట్టు తెలిపా రు. న్యాయస్థానాలను, జైళ్లను అనుసంధానం చేసేందుకు ఈ- కోర్టు విధానంలో భాగంగా వీడియో  లింకేజీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన క్రమంలో పెలైట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 37 వీడియో లింకేజీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో గతనెల 22న మొదటిసారిగా వీడియో లింకేజీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జుడిషియల్ కస్టడీలోని ఖైదీల రిమాం డ్ పొడిగించడం సులభతరమవుతుందని, ప్రభుత్వానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలిపారు. భవిష్యత్‌లో సాక్షుల విచారణ, ఇరువైపుల వాదనలు వినడం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.  ప్రభుత్వ అధికారుల, నిపుణులు తాము కోరుకున్న చోటు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్షం చెప్పడానికి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి టి.ఆనంద్, తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి నాగార్జున, మూడో అదనపు జిల్లా జడ్జి రాంబాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి శ్యామ్‌సుందర్, వీడియో కాన్పరెన్స్ నోడల్ ఆఫీసర్, నాల్గవ అదనపు జూనియర్‌జడ్జి సన్యాసినాయుడు, సీనియర్ సివిల్‌జడ్జిలు రాంగోపాల్, సదానందమూర్తి, జూనియర్‌జడ్జిలు మల్లీశ్వరి, శశిధర్‌రెడ్డి, లీలా వెంకటశేషాద్రి, పి.విజయ, న్యాయవాదులసంఘ కార్యవర్గ సభ్యులు, జిల్లా డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఏపీపీ రాజేంద్రకుమార్, ఇతర పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement