రుచి మరిగిన పులిలా కమిషన్లకు కక్కుర్తి పడి.. | Sakshi
Sakshi News home page

రుచి మరిగిన పులిలా కమిషన్లకు కక్కుర్తి పడి..

Published Sat, Jun 1 2019 1:12 PM

Vatti Vasantha Kumar Slams TDP Government - Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వంలో రుచి మరిగిన పులిలా కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టులు చేపట్టారని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పారదర్శకత లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్‌పై జరుగుతున్న అన్ని పనులు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విచారణ కోసం కమిటీ నియమించిన ఎన్‌జీటీ, నెల రోజుల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. 2015లో పట్టిసీమ, చింతలపాడుతోపాటు అక్రమ ప్రాజెక్టులపై హై కోర్టును ఆశ్రయించినా, చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ వేయలేదు కదా హియరింగ్‌కు కూడా రాలేదని మండిపడ్డారు.

గత్యంతరం లేక ఏన్‌జీటీని ఆశ్రయించానన్నారు. నదుల అనుసంధానం విషయంలో అంతర్ రాష్ట్రాల నుంచి అనుమతులు, పరిరక్షణ చర్యలు తీసుకోలేదన్నారు. 2018లో పెన్నా-గోదావరి అనుసంధానం విషయంలో పోలవరం, గోదావరి ప్రాజెక్ట్ అథారిటీల అనుమతులు పొందలేదని తెలిపారు. డెల్టా ప్రాంత రైతుగా కోర్టును ఆశ్రయించానని, చింతలపూడి, పట్టిసీమ ప్రాజెక్టులు బచావత్ ట్రిబ్యునల్ నిర్ధేశానికి పూర్తి విరుద్ధమన్నారు. టీడీపీ ప్రభుత్వం డెల్టా రైతుల జీవితాలతో ఆడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఎన్‌జీటీ ఆదేశాలు పాటించాలని కోరారు.

Advertisement
Advertisement