వ్యాట్ వాత! | VAT hike | Sakshi
Sakshi News home page

వ్యాట్ వాత!

Jan 28 2015 2:10 AM | Updated on Oct 2 2018 4:53 PM

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఇతర అంశాలెలా ఉన్నా.. ఈ విషయంలో మాత్రం పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా పలు ఇతర రాష్ట్రాలను చంద్రబాబు ప్రభుత్వం అనుసరించనుంది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఇతర అంశాలెలా ఉన్నా.. ఈ విషయంలో మాత్రం పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా పలు ఇతర రాష్ట్రాలను చంద్రబాబు ప్రభుత్వం అనుసరించనుంది. గత ఐదు నెలలుగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుండటంతో ఎంతోకొంత సంతోషంగా ఉన్న వాహనదారులను  నిరాశకు గురిచేయనుంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రస్తుతం విధిస్తున్న వ్యాట్‌ను.. వాటి ధర ల్లో లీటర్‌కు రూ.2 చొప్పున పెంపునకు ప్రభుత్వం భావిస్తోంది.

తద్వారా ఖజానాకు నెలకు రూ.100 కోట్లకు పైగానే ఆదాయం సమకూరనుంది. వ్యాట్ పెంపు  పరిశీలనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల వ్యాట్ రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో రూ.400 కోట్ల మేర నష్టం వస్తోందని చెప్పారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వమే లీటర్‌పై రెండు శాతం చొప్పున సెస్ విధించిందని, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కూడా డీజిల్, పెట్రోల్‌పై ఇటీవల వ్యాట్‌ను పెంచాయని చెప్పుకొచ్చారు.  

జీతాలకు కూడా డబ్బులు లేవంటున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ జీతాలిస్తామని, వేస్ అండ్ మీన్స్ (ఆర్‌బీఐ నుంచి చేబదులు)కు, అప్పులకు వెళ్తామని అన్నారు.ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏకంగా 69 శాతం ఫిట్‌మెంట్ కావాలని డిమాండ్ చేశారన్నారు. దీంతో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అర్థం చేసుకోవాలని  చెప్పామన్నారు. కాగా వచ్చే అర్థిక సంవత్సరం బడ్జెట్‌పై ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని శాఖల మంత్రులు,  అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశమవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement