
ఆ అర్హత రాహుల్‌కు లేదు: వాసిరెడ్డి పద్మ
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని, కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని కక్ష గట్టి వేధించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వైఎస్ విగ్రహానికి పూలదండ వేసే నైతిక అర్హతేలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.
ఏం ముఖం పెట్టుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు?
మీకు అవసరమైతే పూలదండ వేస్తారు.. లేదంటే బురద చల్లేస్తారా?
టీడీపీతో కలసి కేసులు వేసి వైఎస్ కుటుంబాన్ని వేధించింది మరిచారా?
విభజనకు కారణమైన రాహుల్ ఏపీలో ఎలా అడుగుపెడతారు?
జగన్‌ను అక్రమ కేసుల్లో ఇరికించి, వైఎస్ పేరును చార్జిషీట్‌లో చేర్చటం గుర్తులేదా?
హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని, కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని కక్ష గట్టి వేధించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వైఎస్ విగ్రహానికి పూలదండ వేసే నైతిక అర్హతేలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాలపాటు కాంగ్రెస్ అభ్యున్నతికి అహరహం కృషిచేసిన వైఎస్ మరణానంతరం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నించిందన్నారు. జీవించి ఉన్నంతకాలం వైఎస్ రాష్ట్రంలో టీడీపీతో పోరాటం చేస్తే.. అదేపార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా కుట్రపన్ని కేసులు పెట్టించిందని విమర్శించారు. జగన్‌ను సీబీఐ కేసుల్లో ఇరికించడంతోపాటుగా వైఎస్ పేరును చార్జిషీట్‌లో ఏఐసీసీ నేతలు పెట్టించారని ఆవేదన వెలిబుచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ క్షీణించిపోయాక ఇపుడు మళ్లీ వైఎస్ పేరు చెప్పి రాజకీయలబ్ధి పొందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌వారు ముందుకొస్తున్నారన్నారు.
‘‘కాంగ్రెస్‌కు నచ్చితే పూలదండ వేస్తారు, లేకుంటే బురద జల్లుతారా.. అసలు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు? అసలాయనకు ఆ నైతిక హక్కుందా?’’ అని పద్మ ప్రశ్నించారు. వైఎస్‌పై చల్లాల్సినంత బురదజల్లి, ఆయన కుటుంబాన్ని తీవ్ర వేధింపులకు గురిచేసింది చాలక ఇపుడు ఆయన తమ నాయకుడంటూ నివాళులర్పించడానికి రాహుల్ ఏముఖం పెట్టుకుని వస్తున్నారు? మరణించేవరకూ వైఎస్ కాంగ్రెస్ అభ్యున్నతికి కృషిచేస్తే ఆ తర్వాత ఆయన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడమేగాక టీడీపీతో కలసి కేసులు వేసింది మరిచారా? అని ప్రశ్నించారు. వైఎస్ మృతిని తట్టుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాల్ని ఓదారుస్తానంటే కాంగ్రెస్ జగన్‌కు అనుమతినివ్వకుండా అందర్నీ ఒకచోట చేర్చి ఓదార్చాలనే దౌర్భాగ్యపు సలహాను ఆనాడు సోనియాగాంధీ ఇచ్చారని మండిపడ్డారు. మరణించినవారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని ఏఐసీసీ ప్రకటించి ఇన్నేళ్లయినా వారికి అర్ధరూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
సీబీఐ చార్జిషీటులో వైఎస్ పేరు పెట్టించింది మీరే కదా!
టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై జగన్‌పై కేసులు పెట్టించింది.. సీబీఐ చార్జిషీటులో వైఎస్ పేరును పెట్టించిందీ కాంగ్రెస్ నేతలే కదా అని వాసిరెడ్డి పద్మ అన్నారు. అసెంబ్లీలో వైఎస్‌ను ఇష్టానుసారం తూలనాడుతూ ఆయనపై అవాకులు, చవాకులూ పేలుతూ ఉంటే కిమ్మనకుండా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇపుడు వైఎస్ గుర్తుకొచ్చారా? అసలు వైఎస్ విగ్రహంవైపు సూటిగా చూసే ధైర్యం, అర్హత రాహుల్‌కున్నాయా? అని నిలదీశారు. ఇవాళ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి తాముచేసిన పాపాల్ని రాహుల్ కడిగేసుకుంటామనుకుంటే భ్రమే అవుతుందని, రాష్ట్రప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.
నిండుగా ఉండిన రాష్ట్రాన్ని అడ్డంగా విభజించడానికి కారకులైన రాహుల్ అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ అడుగంటిపోవడంతో కాంగ్రెస్‌వారు ఇపుడు మళ్లీ వైఎస్‌ను తమ నేతగా చెప్పుకుని ఆయన పేరుతో లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో భవిష్యత్తు లేదని, ఆ పార్టీ ఇకపై ‘పిల్ల టీడీపీ’గా ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్‌వారికి వైఎస్‌ను జ్ఞాపకం చేసుకునే నైతిక అర్హత కూడా లేదన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదని తమకున్న ఓట్లను చంద్రబాబుకు వేయించి ఆయన సీఎం కావడానికి కాంగ్రెస్ నేతలు తోడ్పడ్డారని, అలాంటిదిపుడు టీడీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని చూడటానికి రాహుల్ ఇక్కడికొస్తున్నారా? అని పద్మ సూటిగా ప్రశ్నించారు.