పాటల తూటా.. పోరు బావుటా | united movement in the district | Sakshi
Sakshi News home page

పాటల తూటా.. పోరు బావుటా

Sep 5 2013 5:10 AM | Updated on Mar 18 2019 8:51 PM

సమైక్య పోరు హోరెత్తుతోంది. విభజన నిర్ణయంపై ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలో కళాకారులు గజ్జెకట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పాటల తూటాలు పేల్చి.. పోరుబావుటా ఎగురవేశారు.

సాక్షి, కర్నూలు: సమైక్య పోరు హోరెత్తుతోంది. విభజన నిర్ణయంపై ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోంది. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలో కళాకారులు గజ్జెకట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పాటల తూటాలు పేల్చి.. పోరుబావుటా ఎగురవేశారు. విభజనకు కారణమైన కాంగ్రెస్ నాయకులు రాజీనామాల  డ్రామాతో దొంగ దీక్షలు చేస్తున్నారంటూ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరంపై టమాటాలు విసిరి నిరసన తెలిపారు.
 
 ఈ సందర్భంగా చోటు చేసుకున్న వాగ్వాదంలో ఉపాధ్యాయులు శిబిరాన్ని ధ్వంసం చేశారు. కలెక్టరేట్ వద్ద కళాకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఆడిపాడిన పాటలు సమైక్యవాదుల్లో ఉత్సాహం నింపాయి. సంక్షేమభవన్ ఉద్యోగులు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు జెడ్పీ నుంచి పాతబస్టాండ్ వద్దనున్న తెలుగుతల్లి విగ్రహం వరకు మోటారు సైకిళ్లతో ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. డోన్ పట్టణంలో రైతుగర్జన పెద్ద ఎత్తున సాగింది. దాదాపు 3వేల మంది రైతులు ఎద్దులబండ్లతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆదోనిలో 48 గంటల బంద్ మొదటి రోజు విజయవంతమైంది. ఆళ్లగడ్డలో ఉద్యోగ జేఏసీ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు.
 
 చాగలమర్రిలో ఉద్యోగ జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఆలూరులో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్ష నిర్వహించారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతుగా వాల్మీకుల సంఘం ఆధ్వర్యంలో 20 మంది దీక్షలో కూర్చొన్నారు. ఎమ్మిగనూరులో మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం ఉద్యోగులు స్థానిక కార్యాలయం నుండి శివ సర్కిల్ వరకు ట్రాక్టర్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పాడ్డారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్టీ యువజన నాయకుడు బందెనవాజ్, విద్యార్ధి సంఘం నాయకులు చేపట్టిన 48 గంటల దీక్ష ముగియడంతో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జ్యూస్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement