సమైక్య జ్వాల.. విభజన ఆగాల


 సాక్షి, కర్నూలు: సడలని దీక్షతో సమైక్య ఉద్యమాన్ని జిల్లా ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. విభజన నిర్ణయంపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు విశ్రమించబోమంటూ ప్రతినబూనారు. ఉద్యోగులను చట్టాల పేరిట బెదిరించే ప్రయత్నం చేస్తున్నా.. వారూ మొక్కవోని దీక్షతో రోడ్డెక్కుతూనే ఉన్నారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు మంగళవారం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ జేఏసీలు ముట్టడించాయి. దీంతో కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డ, నంద్యాల, నందికొట్కూరు, డోన్, కొలిమిగుండ్ల ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.

 

 కర్నూలులో ప్రభుత్వ వైద్యులు కలెక్టరేట్ వద్ద యూపీఏ ప్రభుత్వాన్ని సమాధి చేసి నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆస్తులకు సమీపంలోని దీక్షా శిబిరాలను తొలగించాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు శ్రీకృష్ణదేవరాయ కూడలిలోని దీక్షా శిబిరాలను పోలీసులు తొలగించారు. అయితే 68 రోజులుగా అక్కడే దీక్ష నిర్వహిస్తున్న న్యాయవాదులు ఎండలోనే ఉద్యమాన్ని కొనసాగించారు. టీనోట్‌కు వ్యతిరేకంగా ఆదోనిలో విద్యుత్‌శాఖ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి, పాతబస్టాండ్ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు.

 

 ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. నంద్యాలలో రెవెన్యూ అధికారుల రిలే దీక్ష 35వ రోజుకు చేరుకుంది. పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో పీఆర్ ఉద్యోగులు 48వ రోజు దీక్షను కొనసాగించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంజీవనగర్ గేట్, బస్టాండ్, చామకాల్వ సెంటర్లలో ప్రైవేట్ వాహనాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఎన్‌జీఓ కాలనీ ప్రజల ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. తెలంగాణ నోట్ ప్రతులను ప్రభుత్వ వైద్యులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

 

 ఆత్మకూరులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. పాములపాడులో చౌడేశ్వరి దేవాలయంలో సమైక్యవాదులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందికొట్కూరులో కొత్తబస్టాండ్ నుంచి ర్యాలీ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి పటేల్ విగ్రహం ఎదుట దహనం చేశారు. పత్తికొండలో జేఏసీకి మద్దతుగా వ్యాయామ ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. బనగానపల్లెలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం నిర్వహించారు. బేతంచర్లలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top