జనాగ్రహం | United Andhra Movement in Seemandhra | Sakshi
Sakshi News home page

జనాగ్రహం

Aug 9 2013 3:03 AM | Updated on Oct 22 2018 9:16 PM

జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం రెండవరోజైన మంగళవారం సాగింది. రోడ్లపైనే వంటా వార్పు చేపట్టారు. దీనికితోడు భారీ మానవహారాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, శాస్త్రోక్తంగా సోనియా, రాహుల్, దిగ్విజయ్‌సింగ్, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణలకు పిండ ప్రదానం చేయడంతోపాటు వివిధ రూపాల్లో తెలియజేస్తున్న నిరసనలు, ఆందోళనలతో జిల్లా అట్టుడికిపోతోంది.

 సాక్షి, కడప : జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం రెండవరోజైన మంగళవారం సాగింది. రోడ్లపైనే వంటా వార్పు చేపట్టారు. దీనికితోడు భారీ మానవహారాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, శాస్త్రోక్తంగా సోనియా, రాహుల్, దిగ్విజయ్‌సింగ్, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణలకు పిండ ప్రదానం చేయడంతోపాటు వివిధ రూపాల్లో తెలియజేస్తున్న నిరసనలు, ఆందోళనలతో జిల్లా అట్టుడికిపోతోంది. రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు ఆపే ప్రసక్తే లేదంటూ ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. సమైక్య నినాదాలతో జిల్లా హోరెత్తుతోంది. ఉద్యమం రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. కడపలో ఉపాధ్యాయుల, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 
 వర్తకులు, కేబుల్ ఆపరేటర్లు, మహిళలు, వివిధ ఉద్యోగ సంఘాల, పశుసంవర్ధకశాఖ, పంచాయతీరాజ్, డ్వామా ఉద్యోగులు భారీర్యాలీలు, మానవహారం చేసి సమైక్య వాణిని వినిపించారు. వీరందరూ కలెక్టరేట్‌కు చేరుకోవడంతో కలెక్టరేట్ రోడ్డు జనసంద్రమైంది. దీంతోపాటు వైవీయూ, నర్సింగ్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్చకులు సోనియా, రాహుల్‌గాంధీలకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానం నిర్వహించారు. వై.జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ నాయకులు వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. గతనెల 31వ తేదీ నుంచి మంగళవారం వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు.
 
  జమ్మలమడుగులో ఉపాధ్యాయ జేఏసీ, విద్యార్థుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి.  కొండాపురంలో రైల్‌రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్రగుంట్లలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి.  ఆర్టీపీపీ జేఏసీ ఆధ్వర్యంలో ఆరవ యూనిట్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు.
 
  రైల్వేకోడూరులో రాజకీయ జేఏసీ, విద్యుత్ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉద్యోగులు, విద్యార్థుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు.
 
  పులివెందులలో ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. పూల అంగళ్ల సర్కిల్‌లో భారీ మానవహారాన్ని నిర్మించి వినూత్న రీతిలో మోకాళ్లపై నడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. లయోల డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
 
  రాయచోటిలో జాతీయ నేతల విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ కార్మికులు వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు.
 
  బద్వేలులో సంపూర్ణ బంద్ కొనసాగింది. దీనికి 15 వృత్తిదారుల సంఘాలు తమ మద్దతును తెలిపి భారీ ర్యాలీని నిర్వహించాయి.  పోరుమామిళ్లలో రిలే దీక్షలు చేస్తున్న వారికి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తమ సంఘీభావాన్ని తెలిపారు. కలసపాడులో భారీ ర్యాలీతోపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
 
  ప్రొద్దుటూరులో నాయీ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించి అరగుండు గీయించుకుని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ కార్మికులు వినూత్నరీతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. న్యాయవాదులు, ఎన్జీఓలు, ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
 
  రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీని నిర్వహించారు.  
  మైదుకూరులో ఉద్యోగ, విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియజేశారు.
 
  కమలాపురంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రాస్తారోకో చేపట్టారు. కమలాపురం క్రాస్‌రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 నేడు జిల్లా బంద్
 కడప రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం చేపడుతున్న ఉద్యమాలలో భాగంగా బుధవారం జిల్లా బంద్‌ను చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరుల సౌకర్యార్థం మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే బంద్‌ను చేపడుతున్నట్లు తెలిపారు. బంద్‌లో భాగంగా ఉదయం 9గంటలకు కడపలోని అంబేద్కర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ఇంజనీరింగ్ విద్యార్థులతో ర్యాలీ ఉంటుందన్నారు. మధ్యాహ్నం 1.30గంటలకు ఏడురోడ్ల కూడలిలో ముస్లిం సోదరుల ప్రార్థనా కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర కోసం చేపట్టిన కోటి సంతకాల పత్రాలను ఆవిష్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement