సమైక్య కేక | united agitation becomes severe | Sakshi
Sakshi News home page

సమైక్య కేక

Sep 13 2013 4:43 AM | Updated on Nov 9 2018 4:51 PM

సమైక్య నినాదాలతో కావలి పట్టణం హోరెత్తింది. అందరి నినాదం, లక్ష్యం సమైక్యాంధ్ర సాధనగా గురువారం పట్టణ నడిబొడ్డు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో సమైక్యాంధ్ర ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ‘కావలి కేక’ నిర్వహించారు.

కావలి, న్యూస్‌లైన్ :  సమైక్య నినాదాలతో కావలి పట్టణం హోరెత్తింది. అందరి నినాదం, లక్ష్యం సమైక్యాంధ్ర సాధనగా గురువారం పట్టణ నడిబొడ్డు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో సమైక్యాంధ్ర ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ‘కావలి కేక’ నిర్వహించారు. జిల్లా అధికారులు, సమైక్య వాదులు, ఉద్యోగ సంఘాల నేతలు, స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ సంఘాల నిర్వాహకులు, వ్యాపారులు, కార్మికులు, అన్ని వర్గాలతో లక్ష గళ ఘోష మిన్నంటింది.
 
 పట్టణంలో రెండు కిలోమీటర్ల పొడవున్న భారీ సమైక్య పతాకంతో  విద్యార్థులు రాలీ నిర్వహించారు. తెలుగుతల్లి విగ్రహానికి బ్రాహ్మణ మహాసభ ఆధ్వర్యంలో కుంకుమ పూజ చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సమైక్య గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు డీఆర్వో రామిరెడ్డి మాట్లాడుతూ కొందరి స్వార్థం కోసం రాష్ట్ర విభజన చేయొద్దన్నారు.
 
 రాష్ట్రం విడిపోతే సీమాంధ్రవాసులకు ఎన్నో కష్టాలు ఎదురవుతాయన్నారు. హైదరాబాద్‌ను అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఉద్యోగ, విద్య సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలోని యువత నిరుద్యోగులుగా మారుతారన్నారు. భవిష్యత్ తరాల ప్రయోజనం కోసమే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. ఆర్డీఓ పీవీ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి మాట్లాడుతూ గడ్డిపోచలు ఒక్కటై మదపుటేనుగును బందిస్తాయని, చీమలన్నీ ఒక్కటై మహాసర్పాన్ని చంపుతాయన్నారు.
 
 అదే తరహాలో సమైక్యవాదులందరూ ఒక్కటైతే రాష్ట్ర విభజన అంశం ఆగిపోతుందన్నారు. డీఈఓ మువ్వారామలింగం మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఓ కిరాతకుడిగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నీటి కోసం యుద్ధాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఎన్‌జీఓలు నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు తెలుగువారి ప్రత్యే క రాష్ట్రం కోసం  తన ప్రాణాలను వదిలారన్నారు. బెజవాడ గోపాల్‌రెడ్డి సమైక్యాం ధ్ర రాష్ట్రం కోసం  ముఖ్యమంత్రి పదవిని కూడా వదలుకోగా, విశాలాంధ్ర కోసం పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప పోరాటాన్ని చేశారన్నారు. వీరందరు జిల్లాకు చెందినవారేనని చెప్పారు. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరాహారదీక్ష చేస్తూ ప్రాణాలను వదిలిన ఉపాధ్యాయుడు శంకరయ్య యాదవ్ గొప్ప ఉద్యమకారుడిగా నిలిచారన్నారు.  రాష్ట్రం విభజన జరిగితే విద్య, ఉద్యోగ, విద్యుత్   సమస్యలుతో పాటు పారిశ్రామికంగా తిరోగమనం పరిస్థితులను వివరించారు.  
 
 తెలుగుతల్లికి కుంకుమార్చన
 స్థానిక శివాలయం నుంచి తెలుగుతల్లి విగ్రహాన్ని ఊరేగింపుగా ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లోని సభ ప్రాంగణానికి తీసుకువచ్చారు. శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు సర్వమత ప్రార్థనలను నిర్వహించారు.
 
 సాంస్కృతిక కార్యక్రమాలతో సమైక్య నినాదం
 తెలుగువారందరూ ఒక్కటేనంటూ సాంస్కృతిక కార్యక్రమాలతో సమైక్య నినాదం చాటారు. చిన్నారులు నృత్యాలను ప్రదర్శించారు. కేసీఆర్ , కేటీఆర్, కోదండరాం, హరీష్‌రావు వంటి కేటుగాళ్ల వల్ల ఈ దుస్థితి వచ్చిందంటూ నినాదాలు ఇస్తూ నృత్య ప్రదర్శనలు కొనసాగించారు. కావలి కేకకు వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, వివిధ రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి, అదనపు జేసీ పెంచలరెడ్డి, ఐకేపీ పీడీ వెంకటసుబ్బయ్య, కావలి తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎన్‌జీఓ అసోసియేషన్ కావలి తాలూకా అధ్యక్షుడు నరసారెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ తిరివీధి ప్రసాద్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement