కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో ఓ ఆదివారం రాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు తెలిసింది
కరీంనగర్, న్యూస్‌లైన్: కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో ఓ ఆదివారం రాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు తెలిసింది. చోరీలో కేసులో పోలీసులు అదుపులోకి తమదైన శైలిలో విచారణ చేయడంతో భయాందోళన చెందిన నిందితుడు ఠాణా భవనం పైనుంచి దూకినట్లు సమాచారం.
తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు నిందితుడిని హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ధర్మపురి పట్టణంలో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించి అక్కడి పోలీసులు నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకుని కోరుట్ల ఠాణాకు తరలించినట్లు తెలిసింది. అక్కడ పోలీసు అధికారులు నిందితుడిని రాత్రి 9.30 గంటల సమయంలో ఠాణా భవనం పైగదిలో ఉంచి విచారణ ప్రారంభించారు.
విచారణ సమయంలో పోలీసుల దెబ్బలకు తాళలేక నిందితుడు భవనం పైనుంచి దూకినట్లు సమాచారం. భవనం కిందిభాగంలో ఉన్న మెట్లపై పడడంతో నుదురు భాగంతోపాటు కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. హడలిపోయిన పోలీసులు గాయపడిన నిందితుడిని హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించినట్లు తెలిసింది. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని జగిత్యాల డివిజన్ పోలీసు అధికారి సందర్శించినట్లు తెలిసింది. ఈ సంఘటనను పోలీసులు ధ్రువీకరించలేదు.