18న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Ugadi Asthaanam in Srivari temple on Mar 18  - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీన విళంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి వేర్వేరుగా తిరుమంజనం నిర్వహించి, విశేషాభరణాలతో అలంకరిస్తారు. తర్వాత ఉత్సవమూర్తులను ఘంటామండపంలో వేంచేపు చేసి, పడిప్రసాదాలు, అన్నప్రసాదాలతో నివేదిస్తారు.

అనంతరం ఆస్థాన వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఉన్న పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయిస్తారు. తిథి, వారనక్షత్ర, నూతన సంవత్సర ఫలితాలు, లాభనష్టాలు, నవగ్రహాల గతులు, సవ్యవృద్ధి, పశువృద్ధి, 27 నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజపూజ్యత అవమానాలు ఈ పంచాంగ శ్రవణంలో శ్రీవారికి వినిపిస్తారు. ఈ ఉగాది ఆస్థానం నేపథ్యంలో 18వ తేదీ నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది.

14న అన్నమయ్య 515వ వర్ధంతి ఉత్సవం..
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి 515వ వర్ధంతి మహోత్సవాన్ని ఈనెల 14వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఇక్కడి నారాయణగిరి ఉద్యానవనంలో ఉత్సవమూర్తులు వేంచేపు చేసి, సాయంత్రం 6.00 గంటల నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టిగానం నిర్వహించనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top