విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్‌

Two Maoists Killed, Massive Encounter In Visakha Agency  - Sakshi

ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోల మృతి

సీలేరు (పాడేరు)/సాక్షి, అమరావతి : విశాఖ ఏజెన్సీలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఆదివారం పెద్దఎత్తున జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. పార్టీ అగ్రనాయకురాలు అరుణ ఇందులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గూడెంకొత్తవీధి మండలం సీలేరు పోలీసుస్టేషన్‌ పరిధిలోని మాదిగమల్లు, అన్నవరం సమీప బొడ్డమామిడికొండ ప్రాంతంలో ఆదివారం ఉ.11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..విశాఖ ఏజెన్సీలో కొంతకాలంగా మావో అగ్రనేతలు సంచరిస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున విశాఖ గ్రేహౌండ్స్‌ బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో బొడ్డమామిడి అటవీ ప్రాంతం నుంచి ఉ.10గంటల సమయంలో 15 నుంచి 20 మంది మావోయిస్టులు కొండ దిగుతుండగా అదే సమయంలో గ్రేహౌండ్స్‌ బలగాలు వారికి తారసపడ్డారు.

దీంతో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. ఘటనా స్థలిలో ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకి ఒకటి, రెండు 303 పిస్టళ్లు, ఆరు కిట్‌ బ్యాగులు, ఒక మందుపాతర లభ్యమయ్యాయి. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి ధారకొండ వారపు సంతకు వచ్చిన గిరిజనులు ఈ సంఘటన గురించి «తెలిపారు. ఎదురుకాల్పుల అనంతరం భారీవర్షం పడడంతో పోలీసు బలగాలు అడవిలోనే చిక్కుకుపోయాయి. మావోయిస్టుల మృతదేహాలను సోమవారం నాటికి బయటకు తెచ్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, ఎదురుకాల్పుల్లో మావోలు మృతిచెందిన అనంతరం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ గ్రేహౌండ్స్, స్పెషల్‌ పార్టీ, సీఆర్‌ïపిఎఫ్‌ దళాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి. పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

వారోత్సవాలతో పోలీసుల హైఅలర్ట్‌
కాగా, ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు పసిగట్టడంతో పోలీసులు ఏఓబీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన వారోత్సవాల సమయంలోనే 2018 సెప్టెంబర్‌ 23న అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. వీరిరువురినీ దగ్గర్నుంచి కాల్చింది అరుణ అని అప్పట్లో పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఇటీవల ఈస్ట్‌ జోన్‌కు వచ్చిన అరుణ అలియాస్‌ వెంకట రవిచైతన్య.. ప్రస్తుతం విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఆమె 2015లో నాటి కరీంనగర్‌జిల్లా కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో హతమైన మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌కు సోదరి. అయితే, తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుణ మృతిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.

షెల్టర్‌ కోసం రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు..
గత కొన్నేళ్లుగా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ఏఓబీతోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనమైన తెలంగాణ మండలాల్లో మావోల కదలికలు మళ్లీ కనిపిస్తున్నాయి. షెల్టర్‌జోన్‌గా వీరు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో మావోలు వారోత్సవాలు నిర్వహిస్తుండడం.. ఆ పార్టీ అగ్రనేతలు అందులో పాల్గొనే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో ఆదివారం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కాగా, ఎన్‌కౌంటర్‌ సమాచారం తెలుసుకున్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఏఓబీ సరిహద్దు జిల్లాల ఎస్పీలు, గ్రేహౌండ్స్, ఎస్పీఫ్‌ దళాల పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top