పిల్లి కోసం తల్లడిల్లుతూ..

Twenty Five Days Of Searching For The Missing Cat - Sakshi

తప్పిపోయిన పిల్లికోసం 25 రోజులుగా వెదుకులాట

పిల్లలు లేకపోవడంతో అల్లారుముద్దుగా పెంచుకున్న సూరత్‌ దంపతులు

సాక్షి, రేణిగుంట :  ‘గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌కు చెందిన దంపతులు గత 25రోజులుగా రేణిగుంటలో తచ్చాడుతూ తెలియని భాష మాట్లాడే వ్యక్తుల మధ్య కనిపించిన వారందరినీ వాకబు చేస్తున్నది ఓ పిల్లి కోసం అంటే నమ్మశక్యం కాని విషయం... కానీ నమ్మి తీరాలి.. పిల్లలు లేని తమ జీవితంలో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లిని కన్న బిడ్డ కంటే ఎక్కువగా భావించిన వారు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు తప్పిపోయిన పిల్లి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారంటే.. అందరూ నోరెళ్లబెడుతున్నారు. కానీ వారి అన్వేషణకు అంతమెప్పుడన్నది దేవుడే నిర్ణయించాలి. వారి ఎదురుచూపులు సుఖాంతమై.. తప్పిపోయిన పిల్లి దొరకాలని విషయం తెలిసిన జంతుప్రేమికులు అభిలషిస్తున్నారు.’’

విషయానికొస్తే... గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌కు చెందిన జయేష్‌బాబు, మీన దంపతులు బట్టల వ్యాపారులు. వీరికి పిల్లలు లేరు. వీరు ప్రేమగా పెంచుకున్న పిల్లిని కంటికి రెప్పలా ప్రాణం పెట్టి పెంచుకున్నారు. దాని పేరు బాబు. తిరుమల శ్రీవారి దర్శనార్థం సూరత్‌లో బయల్దేరి గత నెల 9న పిల్లితో సహా రైలు మార్గాన తిరుపతికి వచ్చారు. తిరుమలేశుని దర్శనానంతరం వారు తిరుగు ప్రయాణంలో గత నెల 13న రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లో రైలుకోసం వేచి ఉన్న తరుణంలో తమ వద్దనున్న పిల్లి ఒక్కసారిగా మాయమైంది. కొద్ది నిమిషాల్లోనే తప్పిపోయిన పిల్లికోసం తాము తిరుమలలో పిల్లితో కలిసి ఇష్టంగా తీసుకున్న ఫొటోను చూపిస్తూ స్టేషన్‌ ప్రాంగణమంతా జల్లెడ పట్టారు.

ఎంతకీ పిల్లి ఆచూకీ లభించకపోవడంతో స్వస్థల ప్రయాణాన్ని విరమించుకుని స్టేషన్‌ ప్రాంగణమే కాక, రేణిగుంట మొత్తం తిరుగాడుతూ పిల్లికోసం అలుపెరగని వెదుకులాట ప్రారంభించారు. తప్పిపోయిన పిల్లిని వెదికిపెట్టాలని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు వారిని చూసి నిశ్చేష్టులయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. వారే కనిపించిన వారందరినీ పిల్లి కోసం ఆరా తీశారు. రేణిగుంటకు చెందిన కొందరు ఆకతాయిలు పిల్లిని వెదికిపెడతామని, అక్కడ కనిపించింది... ఇక్కడ కనిపించిందంటూ నమ్మబలికి వారి వద్ద రూ.50వేలు నగదు తీసుకుని మోసం చేసినట్లు ఆ దంపతులు వాపోతున్నారు. అయినా వారు రేణిగుంటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లికోసం వెతుకుతూనే ఉన్నారు. పిల్లి ఆచూకీ తెలిస్తే 9824876542 నంబరుకు సమాచారం అందించాలని వారు వేడుకుంటున్నారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20వేలు బహుమానం ఇస్తామని వారు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top