టెండర్‌.. బ్లండర్‌

Is TTD Going To Tenders Against Government - Sakshi

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను హారతి కర్పూరంలా కరిగిస్తున్నారా.. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా టెండర్లు చేపట్టకపోవడంలో మతలబు అదేనా.. అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల టెండర్‌ ఆహ్వానించిన వైనం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గోశాలకు సంబంధించిన అన్ని వసతులకు ఒకే బిడ్‌గా ఏర్పాటు చేయడం వెనుక మతలబు దాగి ఉంది. టీటీడీ పరిధిలో ఏకైక కాంట్రాక్టర్‌ అర్హతగా రూపొందించి ఈప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లకు పిలిచిన నేపథ్యమిది.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కాంట్రాక్టు పనులకు రివర్స్‌ టెండరింగ్‌ ఆహ్వానించడం ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. పైగా టెండర్ల నిర్వహణలో అత్యంత పారదర్శకంగా ఉంటుందని భావించారు. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పాలసీ తీసుకొచ్చింది. ఈ విధానం సరైంది కాదని ప్రతిపక్షం గగ్గోలు పెట్టినా సత్ఫలితాలు ఇస్తోంది. పోలవరం పనుల్లో రూ.274కోట్లకు టెండర్లు ఆహ్వానిస్తే రూ.58.5 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. ప్రభుత్వ పాలసీని స్ఫూర్తిగా తీసుకుని టెండర్ల నిర్వహణలో ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కాగా ప్రభుత్వ పాలసీ టీటీడీ చెవులకెక్కడం లేదని తెలుస్తోంది. టీటీడీ నిర్ణయించిన బిడ్‌కు అర్హత సాధించే కాంట్రాక్టర్లు లేరని తెలిసి కూడా ఆ విధంగా ముందడుగు వేయడం విశేషం.

కోరుకున్నవారికి కట్టబెట్టేందుకే..
టీటీడీ నేతృత్వంలో పలమనేరు సమీపంలో గోశాల ఏర్పాటు చేయాలని మునుపటి ధర్మకర్తలమండలి నిర్ణయించింది. ఆమేరకు పనులు చేపట్టేందుకు అప్పట్లో ఆదేశాలు జారీచేసింది. ఇంజినీరింగ్‌ అధికారులు టీటీడీ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించే సాహసం  చేయకపోగా గోశాల పనుల ఏర్పాట్లపై ఆసక్తి ప్రదర్శించలేదని సమాచారం. కాగా ఈనెల 4న నెంబర్‌.06/డి3/సీఈ/టీటీడీ ద్వారా రూ.29.97కోట్లు పలమనేరు గోశాల ఏర్పాటుకు, భాకరాపేట గోశాల ఏర్పాటు రూ.5.08 కోట్లు, వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలో కల్యాణవేదిక వద్ద క్వార్టర్స్‌ నిర్మాణానికి రూ.13.5 కోట్లకు ఈప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లును ఆహ్వానించారు. ఆమేరకు ఈనెల 7న షెడ్యూల్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని భాకరాపేటకు 21వ తేదీన, పలమనేరు 23వ తేది, ఒంటిమిట్ట పనులకు 30వతేదీ టెండర్లు దాఖలు చేయాలని సూచించారు.

విడివిడిగా పిలిస్తే స్వామి సొమ్ము ఆదా
ఒకే బిడ్‌ ద్వారా టీటీడీలో రూ.30కోట్లు కాంట్రాక్టు పనులు చేసే అర్హత ఉన్న కాంట్రాక్టర్లు లేరని తెలుస్తోంది. ఒకే ఒక్క కాంట్రాక్టర్‌కు మాత్రమే అలాంటి అర్హత ఉన్నట్లు సమాచారం. మునుపటి పాలకమండలి సైతం సదరు కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన పనులను తాజాగా టెండర్లు ఆహ్వానించారు. తదగుణంగా బిడ్‌ రూపొందించారని సమాచారం. అవే పనులు షెడ్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, రోడ్లు విడివిడిగా టెండర్లు ఆహ్వానిస్తే ఎక్కువమంది కాంట్రాక్టర్లు పాల్గొనే అవకాశం ఉంది. తద్వారా కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఏర్పడి టెండర్లలో తక్కువ రేట్లు కోట్‌ చేసే అవకాశం మెండుగా ఉందని పలువురు వివరిస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ అనేదానికంటే పనులు విడివిడిగా టెండర్లుకు పిలిచింటే, దేవదేవుని సొమ్ము ఆదా అయ్యే అవకాశం ఉంటుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

మునుపటి సీఈ అభ్యంతరం
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని పాలకమండలి నిర్ణయం మేరకు గోశాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించేందుకు అప్పటి సీఈ తెరవెనుక అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలా టెండర్లు ఆహ్వానిస్తే ఒక్క కాంట్రాక్టర్‌కు మాత్రమే అర్హత సాధించనున్నారని గ్రహించి ఆమేరకు టెండర్లు తొక్కి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా అదే నిర్ణయాన్ని తిరిగి ఒకే బిడ్‌గా టెండర్లు ఆహ్వానించారు. ముందుగా అనుకున్నట్లుగా ఆ ఒక్క కాంట్రాక్టర్‌ మాత్రమే అర్హత సాధించనున్నారని సమాచారం. వెరసి దేవుని సొమ్ము ఆదా కాకుండా పోనున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top