జర్నలిస్టులందరికీ త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

triple bed rooms for working journlists said collector pradyumna - Sakshi

తిరుపతి తుడా: వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇచ్చేందుకు వేగవంతంగా ప్రతిపాదనలు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న వెల్లడించారు. తుడా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జర్నలిస్టు సంఘాలతో కలెక్టర్‌ ఇళ్ల స్థలాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్బన్‌ ప్రాంతాల వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు చెప్పారు. తిరుపతి నుంచే ఇళ్ల స్థలాల కేటాయింపులు ప్రారంభమయ్యేలా, అందరికీ రోల్‌ మోడల్‌గా ఉండేలా తాను స్పీడ్‌ ప్రాజెక్టు కింద వేగంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూములు లేనందున జీ ప్లస్‌ త్రీ అపార్టుమెంట్‌లు నిర్మించి త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ప్లాట్లు కేటాయించాలని నిర్ణయిచినట్టు చెప్పారు.

తిరుపతి అర్బన్‌ పరిధిలో ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నందున స్థలాల కేటాయింపు సాధ్యం కాదన్నారు. 1999 సీనియారిటీ లిస్ట్‌ ప్రకారం గుర్తించిన 124 మంది జర్నలిస్టుల్లో పెండింగ్‌లో ఉన్న 54 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతానని హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్‌ మీడియా యూనియన్‌లోని 34 మంది జాబితాను ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతానన్నారు. మిగిలిన జర్నలిస్టులు సొసైటీగా ఏర్పడి నిబంధనల మేరకు జాబితా ఇస్తే వెంటనే ప్రతిపాదనలు ప్రారంభిస్తామన్నారు. తిరుమల జర్నలిస్టుల సంఘం నాయకుడు మల్లి, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మురళీ మోహన్, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, ఇరుగు సుబ్రమణ్యం, జాప్‌ మీడియా సెంటర్‌ జిల్లా కన్వీనర్‌ మనోహర్, సెక్రటరీ సురేంద్రరెడ్డి, జర్నలిస్ట్‌ ఫోరం నుంచి లక్ష్మీపతి, గిరిధర్, ఫెడరేషన్‌ నాయకులు శ్రీధర్, ఆదిమూలం శేఖర్, ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ నాయకులు కె. గిరిబాబు, రాధాకృష్ణ, ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు మురళి  పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top