సంద్రమంత విషాదం

Tragedy In Alumni Conference In Vennelapalem - Sakshi

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పంజా విసిరిన మృత్యువు

తిక్కవానిపాలెం తీరంలో ముగ్గురు యువకుల మృతి.. ఒకరు గల్లంతు

వెన్నెలపాలెంలో విషాదఛాయలు

సాక్షి, పరవాడ : ఆ సంబరం చూసి చూసి సముద్రుడికి ఈర్శ్య కలిగిందేమో వారిని తనలో కలిపేసుకున్నాడు.. వారి వినోదంతో విధికి కన్నుకుట్టిందేమో కన్నెర్ర జేసింది. ఆ కుటుంబాలకు ఆధారం వద్దనుకున్నాడేమో తన దగ్గరికి తీసుకుపోయాడు. కన్నీటికే కన్నీరు వచ్చే విషాదం.. పగవాడికి కూడా రాకూడని కష్టం.. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం.. ఆ గ్రామానికి పెను విషాదం. పరవాడ మండలం ముత్యలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో రాకాసి అలలకు ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. ఇంటికి చేదోడుగా ఉంటాడని ఆశ పడిన ఆ కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చారు. వెన్నెలపాలెంలో నాలుగు నిరుపేద కుటుంబాలు పెట్టుకున్న ఆశలు ఆరిపోయాయి.

పరవాడ పోలీసుల కథనం మేరకు.. వెన్నెలపాలేనికి చెందిన ముగ్గురు యువకులు సముద్ర అలలకు బలికావడం.. మరొకరు గల్లంతు అవ్వడంతో జిల్లాలో తీవ్ర విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన పైలా మహేష్‌(28), మాసవరపు నరేష్‌(27), సిరపరపు రామకృష్ణ(28) సముద్రంలో మునిగి మృత్యు ఒడికి చేరుకోగా.. లాలం నరసింగరావు(27) గల్లంతయ్యాడు. పరవాడలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2008లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’పేరిట ఆదివారం ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో కలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడిపాడి, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

ఈ క్రమంలో వెన్నెలపాలేనికి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణ, నరసింగరావు సముద్ర స్నానానికి దిగతా.. ఓ రాకాసి అల వీరిని సముద్రంలోకి లాగేసింది. దీంతో మహేష్, నరేష్, రామకృష్ణలు తీవ్ర అస్వస్తతకు గురై మరణించగా నరసింగరావు సముద్రంలోకి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సౌత్‌ ఏసీపీ జె.రామ్మోహన్‌రావు అనకాపల్లిలోని మార్చురీకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను సీఐ స్వామినాయుడు, ఎస్‌ఐ వెంకటరావును అడిగి తెలుసుకున్నారు.

దేవుడా మేం ఏ పాపం చేశాం...
సముద్రంలో మునిగి మృతి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణతో పాటు గల్లంతైన నరసింగరావులు ఆయా కుటుంబాల్లో ఒక్కరే మగ సంతానం. మహేష్‌కు మూడేళ్ల కిందట వివాహం జరగ్గా భార్య గౌతమి, రెండేళ్ల పాప రిషిత ఉన్నారు. తండ్రి కలాసీగా పనిచేస్తున్నా మహేష్‌ సంపాదనే ఆధారం. నరేష్‌ అవివాహితుడు కాగా తండ్రి రాజు డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో కాలు విరిగిపోయి ఇంటి వద్ద ఉండే పరిస్థితి. కుటుంబ భారం మీద పడడంతో హిందుజా కంపెనీలో పనికి కుదిరిన నరేష్‌ కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. ఇక రామకృష్ణ కుటుంబానిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. తండ్రి ఉన్న ఎకరంలో సేద్యం చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ. ఇద్దరు ఆడపిల్లల తరువాత రామకృష్ణ జన్మించాడు. గల్లంతైన నరసింగరావు ఏకైక సంతానం. చిన్ననాటి స్నేహితులైన నలుగురిలో ముగ్గురు ఒకే ప్రమాదంలో మరణించడం.. ఒకరు గల్లంతవ్వడంతో ఆయా కుటుంబాలల్లో తీరని విషాదం నెలకొంది. తల్లిదండ్రులతో పాటు బంధవులు, గ్రామస్తులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top