మీరే పౌర పోలీస్‌!

Traffic Violators Can Use Social Media Says Traffic Department In AP - Sakshi

ఉల్లంఘనలకు జరిమానా వేయించే అవకాశం

సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేస్తే సరి

ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేక వాట్సాప్‌ 95428 00800

వంద రోజుల్లో 2,731 ఫిర్యాదులు

అత్యధికంగా విశాఖపట్నం నుంచి 1,444 మంది ఫిర్యాదు

సాక్షి, అమరావతిబ్యూరో: ‘ముగ్గురు యువకులు ఒకే ద్విచక్రవాహనంపై అడ్డదిడ్డంగా నడుపుతూ ఇతరులకు అంతరాయం కలిగిస్తున్నారు. ఆ యువకుల దుడుకు ప్రవర్తనను అడ్డుకోవాలని మీ మనసులో ఉన్నా.. గొడవ జరుగుతుందేమోననే ఆందోళన మిమ్మల్ని ముందుకు వెళ్లనీయడంలేదు. అయితే మీ చేతికి మట్టి అంటుకోకుండా మీ కోరిక నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తూ రవాణాశాఖ ప్రత్యేక వాట్సాప్‌ నెంబరు 9542800800 అందుబాటులోకి తెచ్చింది.

ఉల్లంఘన దారులపై మీరు తీసిన ఫొటోను ఈ వాట్సాప్‌కు జతచేస్తే వారికి జరిమానాలు పడతాయి. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన రాజేష్‌ (పేరు మార్చాం) ఓ ప్రభుత్వ ఉద్యోగి. నిత్యం గొల్లపూడి నుంచి పటమటకు రాకపోకలు సాగిస్తుంటారు. తాను వెళ్లే మార్గంలో తరచూ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు కనిపిస్తుండటంతో ఓ రోజు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, విజయవాడ రవాణాశాఖ అధికారులకు వాట్సప్‌ ద్వారా పంపించారు. ఉల్లంఘన జరిగిందని రవాణాశాఖ నిర్ధారణకు వచ్చాక  ఈ–వెహికల్‌ చెక్‌ రిపోర్ట్‌లో ఆ వివరాలను నమోదు చేయగా, ఉల్లంఘనదారుడికి ఈ–చలానా జారీ అయింది.

రోజూ సగటున 27 వరకు..  
విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగర తదితర జిల్లాల్లో ట్రాఫిక్‌    ఉల్లంఘనలపై తరచూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. రవాణాశాఖ ఈ వాట్సాప్‌ నెంబరును ఆగస్టు 27 నుంచి అమల్లోకి తీసుకురాగా.. ఈ నెల 11వ తేదీ వరకు మొత్తం 2,731 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా విశాఖపట్నం నుంచి 1,444, శ్రీకాకుళం నుంచి 540, కృష్ణా జిల్లాలో 240, గుంటూరు నుంచి 114 ఫిర్యాదులు అందగా.. అనంతపురం జిల్లా నుంచి అత్యల్పంగా 9 ఫిర్యాదులే అందాయి. చాలా జిల్లాల్లో పౌరులు దీనిని ఓ సామాజిక స్పృహగా భావించాలని ఫిర్యాదు చేయడానికి నడుంకట్టారు.

పోలీసు వాహనాలైనా..  
పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖల వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధించరనే ప్రచారం ఉంది. అయితే ప్రభుత్వ వాహనాలపైనా ఫిర్యాదు చేయవచ్చని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాం  
నిబంధనల ఉల్లంఘన జరిగితే సాధారణ ప్రజలెవరైనా రవాణాశాఖ దృష్టికి తీసుకురావచ్చు. అందుకే ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ తరహా ఫిర్యాదుల్ని ప్రోత్సహిస్తున్నాం. ఉల్లంఘన జరిగిందని తేలితే ఈ–చలాన్‌ విధిస్తున్నాం.  – ఎస్‌.వెంకటేశ్వరరావు, డీటీసీ, విజయవాడ

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేవారు వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకోవచ్చు. ఉల్లంఘన జరిగిన ప్రాంతం, వాహన రిజిస్ట్రేషన్‌ నెంబరు,  తేదీ, సమయం.. తదితర వివరాల్ని పొందుపర్చాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులు తీసే ఫొటోపై ఆ సమాచారం ఉంటే మరీ మంచిది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top