ఉత్సవాలను విజయవంతం చేయండి | To the success of the celebrations | Sakshi
Sakshi News home page

ఉత్సవాలను విజయవంతం చేయండి

Nov 22 2014 1:43 AM | Updated on Jul 29 2019 2:44 PM

ఉత్సవాలను విజయవంతం చేయండి - Sakshi

ఉత్సవాలను విజయవంతం చేయండి

పౌర సమాచార ఉత్సవ ఫలితాలు ప్రజలకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

నర్సీపట్నం టౌన్: పౌర సమాచార ఉత్సవ ఫలితాలు ప్రజలకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్థానిక పోలీసు గ్రౌండ్స్‌లో పౌర సమాచార ఉత్సవ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులంతా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. పథకాలపై అవగాహన పొందేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు వీలుగా స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.

ఉత్సవాలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభిస్తారని చెప్పారు. పట్టణంలో రూ.1.5కోట్లతో నిర్మించిన గిరిజన కళాశాల వసతి గృహాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విచ్చేస్తున్నట్లు తెలిపారు.

ఉత్సవంలో అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. శనివారం నుంచి 24 వరకు జరిగే ఉత్సవాలను అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసి, నర్సీపట్నానికి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పీఐబీ అధికారి రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములనాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు.

ఏర్పాట్లు పూర్తి
నర్సీపట్నం టౌన్: నర్సీపట్నంలో జన సూచన అభియాన్ పౌర సమాచార ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర పౌర సమాచార శాఖ అధికారి రెడ్డి పర్యవేక్షణలో స్టాల్స్ ఏర్పాటుకు అందంగా వేదికను తీర్చిదిద్దారు. శాఖల వారీగా అధికారులు పథకాలకు సంబంధించి నమూనాలను ఏర్పాటుచేశారు. వీటిని మంత్రి అయ్యన్నపాత్రుడు, జేసీ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఉత్సవం విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు ప్రారంభానికి ముందు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు పీఐబీ అధికారి రెడ్డి మంత్రికి వివరించారు. వారి వెంట ఆర్డీవో సూర్యారావు, జిల్లా అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement