తాడేపల్లిగూడెం : గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో పెళ్లి బాజాలకు విరామం ఏర్పడనుంది. పుష్కరాల సమయంలో పెళ్లిళ్లు చేయకూడదని పండితులు చెబుతున్న నేపథ్యంలో శనివారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 వరకూ వివాహాలకు విరామం ప్రకటించారు.
తాడేపల్లిగూడెం : గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో పెళ్లి బాజాలకు విరామం ఏర్పడనుంది. పుష్కరాల సమయంలో పెళ్లిళ్లు చేయకూడదని పండితులు చెబుతున్న నేపథ్యంలో శనివారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 వరకూ వివాహాలకు విరామం ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 12 శుక్రవారం అర్ధరాత్రి 12.42 గంటల ముహూర్తమే వివాహాలకు చివరి ముహూర్తమని చెబుతున్నారు. పశ్చిమగోదావరి మొదలుకుని.. ఉత్తరాంధ్ర జిల్లాల వరకూ పుష్కర సమయంలో వివాహాలు చేయరు. వేరే జిల్లాల్లో వివాహాలు చేసుకోవచ్చులే అనుకునే వారు మాత్రం చివరి ముహూర్తమైన శుక్రవారం నాడు నిశ్చితార్థ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. గురు, శుక్రవారాలలో ముహూర్తాలు నిర్ణయించిన వివాహాలు చేయడంలో పెళ్లి బృందాలు ఊపిరాడకుండా ఉన్నాయి. దీంతో ఎక్కడ చూసినా పెళ్లి బాజాల సందడి మిన్నంటింది.
ఎందుకు వివాహాలు చేసుకోకూడదు
సింహరాశిలో గురుడు ప్రవేశించే సమయంలో గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. సింహరాశి అంటే మఖ నక్షత్రంలో నాలుగు పాదాలు, పుబ్బ నక్షత్రంలో నాలుగు పాదాలు, ఉత్తర నక్షత్రంలో ఒకటవ పాదం కలిపి మొత్తం తొమ్మిది పాదాలలో ఉంటుంది. సింహరాశిలో గురుడు ఒకటవ పాదంలో ప్రవేశించగానే గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అధికమాసం.. గురు, శుక్ర మూఢాలలో శుభకార్యాలు ఏ విధంగా జరపకూడదో, అదేవిధంగా గురుడు సింహరాశిలో ఉండగా శుభకార్యాలు జరపకూడదనేది నియమం. సింహరాశిలో గురుడు రమారమి సంవత్సర కాలం ఉంటాడు. అధిక మాసం. గురు. శుక్ర మూఢమిలలో దేశమంతా శుభాకార్యాలు నిషిద్ధం. గురు గ్రహ సంచారం. దేశభేదం, రవిగ్రహ సంచారాన్ని అనుసరించి కొన్ని సడలింపులు ఉంటాయి.
గురుడు కన్యారాశిలో ప్రవేశించే వరకు మెద క్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, గుంటూరు, కృష్ణా, మహబూబ్‌నగర్ , ప్రకాశం, కర్నూలు, అనంతపుం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారు యథావిధిగా వివాహ శుభకార్యాలు జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. పుష్కరాల సమయంలో తూర్పు, పశ్చిమ, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల వారు మాత్రం వివాహాలు చేసుకూడదంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో వివాహాలు చేయాల్సి వస్తే మిగిలిన జిల్లాలకు వెళ్లి చేసుకోవచ్చు. కొత్త కోడల్ని మాత్రం కాపురానికి తీసుకురాకూడదు. వరుడు వేరే జిల్లాల్లో ఉద్యోగ రీత్యా ఉన్నప్పటికీ కాపురానికి ఆ ప్రాంతానికి పంపకూడదు.
ఫిబ్రవరి 11 నుంచి పునఃప్రారంభం
ఈ ఏడాది వరుసగా రెండు నెలలు ఆధిక ఆషాఢం, నిజ ఆషాఢం ఉన్నాయి. ఆషాఢమాసాలు శుభకార్యాలకు మంచివి కాదనే అభిప్రాయం ఉంది. అందువల్ల ఆ నెలల్లో వివాహాలు జరుగవు. సాధారణంగా శ్రావణం, ఆశ్వియుజ, కార్తీకం మాసాలలో వివాహాలు జరుగుతాయి. పుష్కరాల వల్ల ఈ సారి ఆ నెలల్లో వివాహాలు జరిగే అవకాశం లేదు. వివాహాలు తిరిగి మాఘ మాసంలో ఫిబ్రవరి 11 నుంచి పునఃప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు. అప్పటివరకూ వివాహాలు జరిగే అవకాశం లేదని అంటున్నారు. అంటే ఎనిమిది నెలలపాటు వివాహాలు జరగవన్న మాట. ఇదిలావుంటే వివాహాలపై ఆధారపడిన పురోహితులు, క్యాటరింగ్, సన్నాయిమేళం తదితర వర్గాల వారు ఈ ఎనిమిది నెలలు ఏం చేయాలోనని ఆందోళన చెందుతున్నారు.