
తల్లి, సోదరి వేధింపులే కారణమని సూసైడ్ నోట్
హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రియాంక కాలనీలో నివాసం ఉంటున్న రూప అనే గృహిణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన తల్లి, సోదరి వేధింపులే తన చావుకు కారణమని సూసైడ్ నోట్ రాసింది. సీఐ భరత్ కుమార్ కథనం ప్రకారం..
మహబూబాబాద్‌కు చెందిన జంగారెడ్డి, సత్తమ్మల చిన్నకుమార్తె రూప వివాహం 2014లో గుండు జలంధర్ రెడ్డితో జరిగింది. వీరికి సిరిరెడ్డి, వేదాన్ష్ రెడ్డి సంతానం. శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో రూప సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండగా కూతురు సిరిరెడ్డి గమనించి తండ్రికి ఫోన్ చేసింది. దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే చనిపోయింది.
అక్కడ నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభించింది. అందులో తన తండ్రి జంగారెడ్డి రెండునెలల క్రితం చనిపోగా..తల్లి సత్తమ్మ, అక్క చంద్రకళలు తనకు కట్నం కింద రాసిచ్చిన రెండెకరాల భూమిని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నారని, అందువల్లనే తాను చనిపోతున్నట్లు లేఖలో పేర్కొంది. తనకు రాసిచ్చిన రెండెకరాల భూమి తన పిల్లలకే చెందాలని రూప పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.