ఎంత పనిచేశావ్‌ దేవుడా..! 

Three Members Died Fell In Water Farum Fand In Anantapur District - Sakshi

ముగ్గురిని మింగిన ఫారంపాండ్‌ 

పాలబావి గ్రామంలో విషాదం 

మామిడితోట చూసేందుకు వెళ్లిన చిన్నారులు పక్కనే ఫారంపాండ్‌ (నీటికుంట) కనిపించడంతో దగ్గరకెళ్లారు. కాలుజారి ఓ బాలుడు నీటిలోకి పడిపోయాడు. అతడిని రక్షిద్దామని వెళ్లిన మరో బాలుడు కూడా పట్టుతప్పి నీటిలో పడ్డాడు. నీటమునుగుతున్న వారిని కాపాడేందుకు ఈత వచ్చిన పిన్నమ్మ (నవ వధువు) నీటికుంటలోకి దూకినా పిల్లలిద్దరూ గట్టిగా పట్టుకోవడంతో ఆమెసైతం నీటమునిగిపోయింది. సమీపంలోని వారు వచ్చి బయటకు తీసేలోపు ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనతో పాలబావి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

రాప్తాడు: వర్షపునీటితో నిండిన ఫారంపాండ్‌ ముగ్గురిని మింగేసింది. రాప్తాడు మండలం ఎం.చెర్లోపల్లి పంచాయతీలోని పాలబావిలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.ఈ నెల తొమ్మిదో తేదీన హంపాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలబావికి చెందిన మాజీ స్టోర్‌ డీలర్‌ లక్ష్మినారాయణ తమ్ముడు రామకృష్ణ (45) మృతి చెందాడు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బంధువులైన హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ రామచంద్ర, భాగ్యమ్మ దంపతులు కుమారుడు వర్షిత్‌ (7), కానిస్టేబుల్‌ శ్రీరాములు, యశోద దంపతులు చేతన్‌ వర్మ (17)తో కలిసి పదో తేదీన వచ్చారు. ఆదివారం వీరు తిరుగుపయనానికి టికెట్లు బుక్‌ చేసుకున్నారు.  

తోటకెళ్లి తిరిగిరాని లోకాలకు.. 
మాజీ స్టోర్‌ డీలర్‌ లక్ష్మీనారాయణ మామిడి తోటను చూద్దామని పిల్లలు అడగడంతో కుటుంబ సభ్యులు శనివారం తోటకు తీసుకెళ్లారు. తోట సమీపంలోనే ఫారంపాండ్‌ (నీటి కుంట) ఉండటంతో ఆ గుంతలో నీటిని చూసేందుకు వర్షిత్, చేతన్‌ వర్మ అక్కడికి వెళ్లారు. వర్షిత్‌ కాలు జారి గుంతలోకి జారి పోయాడు. అతడిని కాపాడేందుకు చేతన్‌ వర్మ కూడా నీళ్లలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న వీరి పిన్నమ్మ మమతతో పాటు అనూష గమనించారు. ఈత వచ్చిన మమత వారిని రక్షించేందుకు నీటిలోకి దిగింది. అయితే పిల్లలిద్దరూ గట్టిగా పట్టుకున్నారు. దీంతో ఈతకొట్టే అవకాశం లేక పిల్లలతో కలిసి ఆమె కూడా నీటమునిగింది. గట్టు మీద ఉన్న అనూష కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వారిని బయటకు తీసేలోపే ముగ్గురూ మృతి చెందారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ రామాంజనేయరెడ్డి, సీఐ భాస్కర్‌గౌడ్, ఎస్‌ఐ ఆంజనేయులు పరిశీలించారు. 

ఎంత పనిచేశావ్‌ దేవుడా..! 
అయ్యో దేవుడా... మాపై నీకు దయ లేదా? అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ముగ్గురు పిల్లల్నీ ఒకే సారి తీసుకెళ్లావా? ఒక్క రోజు గడిచి ఉంటే మేము హైదరాబాద్‌కు వెళ్లే వాళ్లం. మా బంధువు మృతి చెందాడని ఆయన్ని కడసారి చూపులు చూసుకోవడానికి వస్తే మా బిడ్డలనే నీ దగ్గరకు తీసుకుపోతివా అంటూ ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది.  
► రామచంద్ర, భాగ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడే వర్షిత్‌. శ్రీరాములు, యశోదమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మాజీ స్టోర్‌ డీలర్‌ లక్ష్మినారాయణకు రామ చంద్ర, శ్రీరాములు బావమరుదులు.  
► మాజీ స్టోర్‌ డీలర్‌ లక్ష్మినారాయణ ఏకైక కూతరు మమతను గ్రామంలోనే ప్రసాద్‌ అనే యువకుడికి ఇచ్చి నాలుగు నెలల కిత్రం అంగరంగ వైభవంగా వివాహం జరిపిం చాడు. పిల్లలను కాపాడబోయి తనూ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు   లక్ష్మినారాయణ, పార్వతమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.  

బాధితులకు వైఎస్సార్‌సీపీ నాయకుల పరామర్శ 
ఫారంపాండ్‌లో నీటమునిగి ముగ్గురు మృతి చెందిన విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు, వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి పాలబావి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబలను పరామర్శించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బోయ రామాంజినేయులు, యూత్‌ మండల కన్వీనర్‌ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయకులు మామిళ్లపల్లి అమర్‌   నాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.   

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ 
ఫారంపాండ్‌ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు, వివాహిత మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలను ఆదుకుంటామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. నీటికుంటలో పడి ముగ్గురు మృతి చెందిన విషయం తెలియగానే ఎంపీ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు నీటికుంటలు నిండిపోయాయని, పిల్లలు అటువైపు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సెలవు రోజుల్లో పిల్లలు సరదాగా ఆడుకునేందుకు వెళ్తూ అవగాహన లేక ప్రమాదం కొని తెచ్చుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top