ముగ్గురి ప్రాణాలు బలిగొన్న మద్యం మత్తు | Three died Alcohol intoxication | Sakshi
Sakshi News home page

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న మద్యం మత్తు

May 28 2014 1:33 AM | Updated on Aug 30 2018 3:58 PM

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న మద్యం మత్తు - Sakshi

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న మద్యం మత్తు

పట్టణంలోని ఆర్.కె టౌన్ షిప్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

 విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: పట్టణంలోని ఆర్.కె టౌన్ షిప్ వద్ద  మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొండపల్లి మండలం నెలివాడ గ్రామానికి చెందిన సొలాపు జయరామినాయుడు గ్రామ బీపీఎంగా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం కార్యాలయ పనుల నిమిత్తం జిల్లాకేంద్రానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా   జేఎన్‌టీయూ సమీపంలోని ఆర్.కె టౌన్ షిప్ వద్ద ఎదురుగా వస్తున్న  కారు ఢీకొనడంతో అక్కడికక్కడే  దుర్మరణం చెందారు. జయరామినాయుడు మృతిచెం దాడని తెలుసుకున్న కారు డ్రైవరు అక్కడి  నుంచి పరారయ్యేం దుకు ప్రయత్నించాడు.  
 
 ఈ క్రమంలో కారును వేగంగా వెనక్కి తీసి ముందుకు నడిపేందుకు ప్రయత్నించాడు.  ఆ సమయంలో బొండపల్లి వైపునుంచి స్కూటీపై వస్తున్న విజయనగరం పట్టణం కొత్తపేటకు చెందిన కొరాడ త్రినాథ్, వరుసకు చెల్లెలైన బొండపల్లిలోని గొల్లవీధికి చెందిన నమ్మి.లక్ష్మి (14) ల వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు  108కు సమాచారం అందించడంతో తీవ్రగాయాలైన ఇద్దరినీ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నమ్మిలక్ష్మి మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన త్రినాథ్ పరిస్థితి విషమంగా ఉండడంతో  విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ త్రినాథ్ కూడా మృతి చెందాడు. రూరల్ సీఐ ఆర్.గోవిందరావు, ఎస్సై దుర్గాప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం జయరామినాయుడు మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారుడ్రైవర్‌ను  అదుపులోకి తీసుకుని వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
 
 కారులో మద్యం బాటిళ్లు
 కారులో రెండు బీరు బాటిళ్లు  ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులుకూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆస్పత్రి ఆవరణలో విషాదఛాయలు
 మృతుడు ఎస్.జయరామినాయుడు నెలివాడ గ్రామ బీపీఎంగా పనిచేయడం, మృతుడి కుమారుడు భాస్కరరావు  గ్రామ ఉపసర్పంచ్‌గా ఇటీవల ఎన్నికకావడంతో ప్రజలు మృతదేహాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో గ్రామంనుంచి ఆస్పత్రికి తరలి వచ్చారు. దీంతో ఆస్పత్రి ఆవరణ అంతా ఆర్తనాదాలతో విషాద వాతావరణం అలముకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement