కొండెక్కిన ధాన్యం కొనుగోళ్లు

There is no proper Grain purchases - Sakshi

20 రోజులుగా మూతబడ్డ కొనుగోలు కేంద్రాలు

మిల్లర్లు, కమీషన్‌ ఏజెంట్లదే హవా 

తడిసిన ధాన్యం రైతులకు తప్పని తిప్పలు  

కొనుగోలు చేసేందుకు అధికారుల నిరాకరణ 

అన్నదాతకు మద్దతు ధర గాలికి.. 

పండుగ పూట రైతన్న దిగాలు

ప్రభుత్వ ఆదేశాలు లేవంటున్నారు.. 
అయ్యా...మాది పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు. మా ఊళ్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు కొని 20 రోజులు దాటింది. ఎందుకు ఆపారో తెలియదు. అదేమంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం లేదంటున్నారు. పంట పండించినా, పండించక పోయినా కష్టాలు తప్పడం లేదు. మా గోడు వినేవారే లేరు. ఎక్కడ చావమంటారయ్యా?  
 – శ్రీనివాస్‌ (కౌలు రైతు) 

తిప్పి పంపిస్తున్నారు.. 
తూర్పు గోదావరి జిల్లాలోని 16 మండలాల్లో 294 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ ఘనంగా ప్రకటించారు. ధాన్యాన్ని ఎప్పుడు తీసుకువెళ్లినా ఏదో ఒక వంకతో తిప్పి పంపిస్తూనే ఉన్నారు.
– పి.ప్రసాద్‌ (రైతు, పిఠాపురం) 

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి డెల్టాలో ఏ మూలకు వెళ్లినా ధాన్యం పండించే రైతుల గోడు ఇదీ. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలలు దాటినా అధికారిక లెక్కల ప్రకారమే సగానికి కూడా మించలేదు. ఖరీఫ్‌లో 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్టు గత నవంబర్‌ 13న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి ప్రకటించగా ఆదివారం నాటికి 19.72 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొన్నట్టు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇందులో సగానికిపైగా మిల్లర్లు, కమీషన్‌ ఏజెంట్లు కొనుగోలు చేసిందే ఉంది. మరోవైపు అక్టోబర్‌– నవంబర్‌ నాటికే 1,500 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1,332 మాత్రమే ఏర్పాటయ్యాయి.  

బస్తాకు రూ.200 దాకా నష్టపోతున్న రైతులు.. 
నిబంధనల ప్రకారం మహిళా స్వయం సహాయక సంఘాలు (వెలుగు), పీఏసీఎస్, డీసీఎంఎస్‌లు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి. ప్రతి కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉండాలి. ధాన్యం విక్రయించే రైతుల ఖాతాల్లోకి ఆన్‌లైన్‌లో నేరుగా డబ్బు జమ చేయాలి. రైతులకు రవాణా ఖర్చులు కూడా చెల్లించాలి. ఒకవేళ మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేస్తే కనీస మద్దతు ధర ఇవ్వాలి. మిల్లర్లు కూడా రైతులకు ఆన్‌లైన్‌ లేదా చెక్కుల రూపంలో చెల్లించాలి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు దారుణంగా ఉన్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకారం 75 కిలోల వడ్ల బస్తాకు గరిష్టంగా రూ.1,312 చొప్పున ధర పలకాల్సి ఉంటే రైతులకు దక్కింది వేయి, రూ.1,150 మధ్యే ఉండటం గమనార్హం. దీంతో రైతులు బస్తాకు కనీసం రూ.రెండు వందలు దాకా నష్టపోతున్నారు. ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని క్వింటాల్‌ రూ.1,790, సాధారణ రకాన్ని రూ.1,750 చొప్పున కొంటామని మంత్రి సోమిరెడ్డి గతంలో చెప్పారు. 
 
20 రోజులుగా మూత... 
రైస్‌ మిల్లర్లతో సయోధ్య కొరవడడంతో గత 20 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. 2018–19 ఖరీఫ్‌ సీజన్‌లో వరి దిగుబడి 86.17 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 లక్షల టన్నులే కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ధాన్యం కేంద్రాలలో కొనుగోలు చేసిన వడ్లను రైస్‌ మిల్లర్లు మర ఆడించి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ధాన్యం కేంద్రాలలో క్రయ విక్రయాలు ఆగిపోవడంతో ఎక్కడి సరకు అక్కడ నిలిచిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కమీషన్‌ ఏజెంట్లు పెద్దఎత్తున ధాన్యాన్ని తక్కువ రేటుకు కల్లాల్లోనే కొంటూ లబ్ధి పొందుతున్నారు. రైతు సంఘాలు ఈ వ్యవహారాన్ని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం శూన్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సక్రమంగా అందాలంటే విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.   
  
ఎంటీయూ 1010 రకం కొనరట! 

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పండించే ఐఆర్‌ 64, ఎంటీయూ 1010, 1001 రకాలను కొనుగోలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా చెబుతోంది. ధాన్యం కేంద్రాలలో ఈ రకాన్ని కొనుగోలు చేయడం లేదు. ఈ రకం ధాన్యాన్ని రాష్ట్రంలో తినరని పేర్కొంటూ బహిరంగ మార్కెట్, ఇతర రాష్ట్రాల్లో విక్రయించుకోవాలని సూచించడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

సర్కారు దగాకు రుజువు... 
’పెథాయ్‌ తుపానుతో తడిసిన ధాన్యాన్ని కొంటామని మంత్రులు మొదలు ముఖ్యమంత్రి వరకు అంతా చెప్పారు. కృష్ణా జిల్లాలోని ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం నుంచి మార్చిన నిబంధనలు రాలేదు. మేం ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు. సర్కారు దగాకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?’  
– పి.జమలయ్య (కౌలు రైతుల సంఘం నేత) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top