సాక్షి, నెల్లూరు జిల్లా: అక్రమ కేసులకు బెదిరేదే లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ‘‘సోమిరెడ్డి అక్రమాలపై ధర్మ పోరాటం చేశాను. దేవాలయాల భూములు కాజేస్తున్నాడని ఎమ్మెల్యే సోమిరెడ్డిని ప్రశ్నించడం నేరమా..?. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటి.. కొంచెం అయిన సిగ్గు పడ్డాలి’’ అంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘టీడీపీ ఎమ్మెల్యే సొమిరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల కంపు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దేవుడి భూమలకు కాపలా కాశాం. టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జా చేస్తున్నారు. దేవుడి ధర్మాన్ని పక్కనపెట్టి దోపిడీ ధర్మాన్ని పాటిస్తున్నారు. సోమిరెడ్డిలాంటి దొంగల మీద కేసు పెట్టకుండా మీద నా మీద పెట్టడమేంటి?’’ అని కాకాణి మండిపడ్డారు.
‘‘సోమిరెడ్డి దమ్ముంటే నార్కో అనాలిసిస్ టెస్ట్‌కి సిద్ధమా?. నువ్వు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూమిని అక్రమార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్ట్‌కు సిద్ధం’’ అని కాకాణి సవాల్ విసిరారు.
దేవుడు భూములు దగ్గరకు పోలీసులు వస్తే నిజాలు బయటకు వస్తాయి. కాకుటూరు శివాలయం భూములు సోమిరెడ్డి కబ్జా చేశారు. 1980లో హరిప్రసాద్‌రెడ్డి అనే దాత శివాలయానికి భూములిచ్చారు. దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డ్‌ల్లోనే ఉంది. దేవుడి భూములు వేరుచేసి పెన్సింగ్ వేయాల్సిన అవసరం ఏంటి?. దేవుడి భూములు వేరుచేసి రోడ్డు ఎందుకు వేశారు?. సోమిరెడ్డి రూ.కోటి తీసుకుని దేవుడి భూమిని అక్రమార్కులకు కట్టబెట్టారు. కాకుటూరులో సర్వే నెంబర్ 63-ఏ1లోని 0.48 సెంట్ల భూమిని ఆక్రమించారు. భూమిని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు’’ అని కాకాణి ఆరోపించారు.


