అక్కడ ప్రమాదం.. ఇక్కడ తనిఖీలు | There Accident .. Here checks | Sakshi
Sakshi News home page

అక్కడ ప్రమాదం.. ఇక్కడ తనిఖీలు

Jul 26 2014 2:56 AM | Updated on Sep 15 2018 4:05 PM

మెదక్ జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలో రవాణాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు.

  • మత్తువీడిన రవాణశాఖ అధికారులు
  • రెండు రోజులుగా స్కూల్ బస్సుల తనిఖీలు
  • ఒంగోలు క్రైం :మెదక్ జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలో రవాణాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు.  పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా బస్సులను తనిఖీ చేయని అధికారులు.. మెదక్‌లో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పాఠశాలలు ప్రారంభానికి మందే బస్సులను ఆర్టీవో అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. ఇంతవరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకోకుండానే 150 బస్సులు విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లి తీసుకొస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1310 స్కూలు, కళాశాలలకు చెందిన బస్సులు ఉన్నాయి.

    ఇవి కళాశాలల యాజమాన్యాలు ఆర్టీవో అధికారులకు ఇచ్చిన  లెక్కలు మాత్రమే. ఇవికాకుండా ఆటోలు, మినీ వ్యాన్‌లు, చిన్న చిన్నవాహనాలు వందల కొద్దీ ఉన్నా అవి ఆర్టీఏ అధికారుల లెక్కల్లో లేవు. రవాణశాఖ అధికారుల కళ్ల ముందు ఫిట్‌నెస్ చేయించుకోని వాహనాలు తిరుగుతున్నా వాటి వైపు కన్నెత్తి కూడా చూసిన పాపాన పోవడంలేదు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం 1099 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేశారు.  మెదక్ సంఘటనతో జిల్లా రవాణాశాఖాధికారులు అప్పటికప్పుడు రోడ్లపైకి వచ్చారు. బస్సులను తనిఖీ చేసే కార్యక్రమాన్ని హడావుడిగా చేపట్టారు. ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం కూడా జిల్లావ్యాప్తంగా పాఠశాలల, కళాశాలల బస్సులపై దాడులు నిర్వహించారు.

    జిల్లాలో ఆర్టీవో పి.కృష్ణమోహన్‌తో కలిసి 16 మంది రవాణాశాఖాధికారులు ఉన్నారు. ఒక్క ఒంగోలులోనే 11 మంది బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కాకుండా కందుకూరు, చీరాల, మార్కాపురం, దర్శి కేంద్రాలుగా బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతమంది అధికారులు ఉన్నా స్కూలు బస్సులపై కనీస నిఘా పెట్టకపోవడంతో అక్కడక్కడా పమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఒంగోలులోనే మంగమూరు రోడ్డు బైపాస్ సమీపంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. టైరు పంక్చరై రోడ్డు మార్జిన్‌లోకి దూసుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడగలిగారు. అదే వెనుక నుంచి ఏదైనా వాహనం వేగంగా వచ్చి ఉంటే పెను ప్రమాదమే జరిగేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement