నిరాశావర్కర్లు | The strike of asha activists took place on September 5, 6 and 7 under CITU | Sakshi
Sakshi News home page

నిరాశావర్కర్లు

Sep 5 2017 12:52 AM | Updated on Sep 17 2017 6:23 PM

నిరాశావర్కర్లు

నిరాశావర్కర్లు

మాతా శిశు సంరక్షణ–సంక్షేమం కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నియమించిన ఆశ వర్కర్లకు భరోసా లేకుండా పోయింది.

ఆశ కార్యకర్తలకు భరోసా కరవు
పని భద్రత, పీఎఫ్, ప్రమాదబీమా సౌకర్యాలు లేవు
విధులు విస్తారం.. పారితోషికం పాక్షికం..
రేపటి నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న వైనం

పర్చూరు:  మాతా శిశు సంరక్షణ–సంక్షేమం కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నియమించిన ఆశ వర్కర్లకు భరోసా లేకుండా పోయింది. భవిష్యత్‌పై ఆశతో ఏళ్ల తరబడి వెట్టిచాకిరి చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడం లేదు. వీరికి ఇచ్చే పారితోషికం నెలల తరబడి చెల్లించకపోవడం, వారి డిమాండ్ల పరిష్కారంపై పాలకులు పట్టించుకోకపోయినా వారి విధులు మాత్రం సక్రమంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు.


మాతా శిశు సంక్షేమానికి పనికి తగ్గ పారితోషికం పేరుతో ప్రభుత్వం పదేళ్ల క్రితం ఆశ వర్కర్లను నియమించింది. జిల్లాలో 91 పిహెచ్‌సీల పరిధిలో సుమారు 3000 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. పనికి తగ్గ పారితోషికం సకాలంలో అందక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థాయిలో అన్ని రకాల విధులు నిర్వర్తిస్తున్న ఆశాలకు ఇచ్చే పారితోషికం ఏ నెలకు ఆ నెల సక్రమంగా అందకపోవడంతో అవస్థలు తప్పటం లేదు. ఐదేళ్లుగా యూనిఫాం సరఫరా చేయలేదు. అప్పట్లో ఇచ్చిన యూనిఫారాలనే నేటికి ఆశాలు వినియోగించాల్సిన దుస్థితి ఏర్పడింది.

డిమాండ్లు ఇవీ...
పన్నెండేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న ఆశాలకు కనీస వేతనం రూ.6వేలు చెల్లించాలి
ఏటా యూనిఫాం సరఫరా చేయాలి.
♦  పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాదబీమా, పనిభద్రత కల్పించాలి.
చంద్రన్న సంచార చికిత్స బకాయిలు వెంటనే చెల్లించి, పారితోషికం రూ.300కి పెంచాలి.
2013–2014 నుంచి యూనిఫాం, అలవెన్స్‌ లు వెంటనే చెల్లించాలి.
అర్హులైన వారికి ఏఎన్‌ఎం శిక్షణ ఇవ్వాలి.
శిక్షణ పొందిన వారికి 2వ ఏఎన్‌ఎంగా తీసుకోవాలి.

ఈ డిమాండ్లతో ఆశ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో సమ్మె చేపట్టనున్నారు.11వ తేదీన ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో ఆందోళనలకు శ్రీకారం చుట్టనున్నారు.

ప్రభుత్వం కళ్లు తెరవాలి
ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కళ్లు తెరవాలి. తెలంగాణలో ఆశాలకు ఇస్తామన్న గౌరవవేతనం ఏపీలో వెంటనే అమలు చేయాలి. సమస్యల పరిష్కారానికి సెప్టెంబరు 5న పీహెచ్‌సీల వద్ద, 6న నోటికి నల్లబ్యాడ్జీలతో తహశీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా, 7న డివిజన్‌ సెంటర్ల వద్ద రాస్తారోకోలు నిర్వహిస్తాం.
– జి.ప్రతాప్‌కుమార్‌ సీఐటీయూ పర్చూరు డివిజన్‌ కార్యదర్శి..

ఆశతోనే పనిచేస్తున్నాం..
ఆశ ర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, గౌరవ వేతనం ఇస్తుందని, జీవనం గడుస్తుందన్న ఆశతోనే పనిచేస్తున్నాం. ప్రభుత్వం సానుభూతితో సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పిస్తుందన్న ఆశతోనే ఉన్నాం. తెలంగాణలో ఆశవర్కర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని మాకూ అమలు చేయాలి.
– సుజాత, ఆశ కార్యకర్త

శ్రమకు తగ్గ ఫలితం లేదు
గ్రామాల్లో తాము పడుతున్న శ్రమకు తగ్గ ఫలితం అందటం లేదు. ప్రభుత్వం ఎప్పటికైనా న్యాయం చేస్తుందన్న నమ్మకంతో వేరే పనికి వెళ్లలేకపోతున్నాం. మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందన్న ఆశతోనే పనిచేస్తున్నాం.
– సుభాషిణి, ఆశ కార్యకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement