కుప్పం బ్రాంచి కెనాల్‌కు తొలగిన అడ్డంకి | Sakshi
Sakshi News home page

కుప్పం బ్రాంచి కెనాల్‌కు తొలగిన అడ్డంకి

Published Wed, Mar 23 2016 2:01 AM

the obstacle has ceased to Kuppam Branch Canal

ఒప్పందం మేరకు రైతులకు పరిహారం
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ఫలించిన కలెక్టర్, జేసీ, ఎస్‌ఈ ప్రయత్నాలు

 
 
తిరుపతి: కుప్పం బ్రాంచి కెనాల్ పనులకు సంబంధించి భూసేకరణకు అడ్డంకులు తొలిగాయి. గ్రామసభలో అధికారులు, రైతుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించవచ్చంటూ ప్రభుత్వం సోమవారం జీవో (నంబర్ 219 ) జారీచేసింది. దీంతో భూసేకరణ పనులు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా, ఇరిగేషన్ ఎస్‌ఈ మురళీనాథరెడ్డి రైతులతో చర్చించి కొంతమేర భూమిని స్వాధీనం చేసుకుని కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు. వారు చెప్పిన గడువులోపు పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు పలుచోట్ల కాలువ పనులను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని జిల్లాకలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్ విలువ ప్రకారం కాకుండా అక్కడ చర్చల ద్వారా నిర్ణయించిన ధరలు చెల్లిస్తామని జీవో జారీ చేయకపోతే పనులు జరగడం కష్టమని తెలియజేశారు. దీనికి స్పందించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  భూమి మార్కెట్ విలువకంటే 30 నుంచి 40 శాతం పెంచి రైతులకు పరిహారం ఇచ్చే వెసలుబాటు కల్పించింది. ఆ ప్రకారం ఎకరా విలువ దాదాపు రూ.7లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతులతో ఒప్పందం కుదిరినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

మే నెలలో పరిహారం
కుప్పం బ్రాంచి కెనాల్ కోసం భూములు సేకరించిన రెతులకు మే నెలలో పరిహారం ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.  ఈ కాలువ కోసం గంగవరం, బెరైడ్డిపల్లె, పెద్దపంజాణి, వి,కోట, రామకుప్పం, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండలాల్లో 1,800 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇందులో దాదాపు 500 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. దాంతోపాటు భూములు కోల్పోయే రైతులు దాదాపు 1,500 నుంచి 1,600 మంది ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు దాదాపు రూ.90కోట్లు పరిహారం చెల్లించాల్సి వస్తుందని అధికారులు తాత్కాలిక అంచనా వేసినట్టు సమాచారం.
 
పనులను వేగవంతం చేస్తాం
 ప్రభుత్వం 219 జీవో జారీచేయడంతో భూసేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భూములకు పరిహారం చెల్లిస్తాం. ఇక కాలువ పనులను వేగవంతం చేస్తాం.
 - మురళీనాథరెడ్డి, ఎస్‌ఈ, హంద్రీ-నీవా
 
 

Advertisement
Advertisement