జిల్లాలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణం పడకేసింది. కొన్ని చోట్ల అధికారులు బిల్లుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. సిమెంటు, బిల్లుల పంపిణీ ఆలస్యం అవుతుండడంతో లబ్ధిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోలేకపోతున్నారు.
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణం పడకేసింది. కొన్ని చోట్ల అధికారులు బిల్లుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. సిమెంటు, బిల్లుల పంపిణీ ఆలస్యం అవుతుండడంతో లబ్ధిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోలేకపోతున్నారు. ఇందిరమ్మ మొదటి, రెండు, మూడు విడతలతో పాటు రచ్చబండ-1, రచ్చబండ-2 కింద 4,47,205 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 3,00,210 ఇళ్లు పూర్తయ్యాయి.
62,745 ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 31,276 ఇళ్లు గోడల స్థాయిలో, 4,720 ఇళ్లు గోడల కన్నా తక్కువ స్థాయిలో, 31,926 ఇళ్లు పునాది స్థాయిలో, 16,278 ఇళ్లు పునాది కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది 29,549 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటిదాకా 4,955 మాత్రమే పూర్తి చేశారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని బిల్లుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
చివరికి లబ్ధిదారుడు ఎంతో కొంత మామూళ్లు ముట్టచెపితే బిల్లు మంజూరుకు ఎంబుక్ రికార్డు చేసి పంపుతున్నారు. అలా ఇచ్చుకోలేని వారు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వచ్చే అదనపు మొత్తంలో అధికారులు అందినంత గుంజుతున్నారు.