రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి

Ten lakh rupees compensation should pay - Sakshi

మృతుల కుటుంబాలకు తక్షణమే అందించాలి

22న జీఎంసీ కార్యాలయం ముట్టడి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు

కొరిటెపాడు(గుంటూరు): ‘‘గుంటూరులో డయేరియా ప్రబలి అనేక మంది పేదలు మృత్యువాత పడ్డారు. ఒక్కో కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి’’ అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు అధ్యక్షతన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

కృష్ణయ్య మాట్లాడుతూ నీరు కలుషితం కాకుండా చూడకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇప్పటికి 25 మంది వరకు మృతి చెందారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బాధితులకు వైద్యం అందడంలోనూ ఆలస్యం జరుగుతుందనీ, అనుభవం ఉన్న వైద్యులతో చికిత్స అందించాలని కోరారు.

వైఎస్సార్‌ సీపీ, జనసేన మద్దతు
మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ, జనసేన పార్టీలు కూడా మద్దతు తెలిపాయన్నారు. గుంటూరుకు కూతవేటు దూరంలోనే ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం ఆయన పరిపాలనా తీరుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ చంద్రన్న బీమాతో సంబంధంలేకుండా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఈ నెల 22న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీఎంసీ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తున్నట్లు చెప్పారు.

సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ నగరంలోని మిగిలిన ప్రాంతాలకు డయేరియా వ్యాపించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.  ఇండియన్‌ ముస్లిం లీగ్‌ నాయకుడు బషీర్‌ మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ నాయకుడు సురేష్, ముస్లిం హక్కుల జేఏసీ నాయకుడు ఖలీల్‌తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు నాగేశ్వరరావు, అక్బర్, అరుణ్, సిహెచ్‌.వాసు, నళినీకాంత్, వెంకటేశ్వర్లు, రమేష్, అరుణ, అమీర్‌వలి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మృతులకు సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

పలు తీర్మానాలు ఆమోదం
అనంతరం మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, మృతుల సంఖ్యను ఖచ్చితంగా తేల్చాలని, యుద్ధ ప్రాతిపదికన పైపులైన్లు మార్చాలని, యూజీడీ పనులు సత్వరమే పూర్తి చేయాలని, డిమాండ్ల సాధన కోసం సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం, బుధవారం మృతులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల మౌనం పాటించడం, 22న జీఎంసీ కార్యాలయం ముట్టడి చేపట్టాలని తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top