
పిఠాపురం: స్కూలు బస్సు కాలువలో బోల్తా పడిన సంఘటనలో పది మంది విద్యార్థులు గాయపడగా 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ఆదర్శ పబ్లిక్ స్కూలు బస్సు ఉదయం కొత్తపల్లి మండలం శ్రీరాంపురం నుంచి రావివారిపోడు, రామరాఘవపురం, రమణక్కపేట, నాగులాపల్లి మీదుగా విద్యార్థులను ఎక్కించుకుని పిఠాపురం వెళుతుండగా ఇసుకపల్లి సమీపంలోని నాగంపాలెం వద్ద బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి తిరగబడింది.
దాంతో బస్సులో ఉన్న 25 మంది పిల్లలు భయాందోళనలతో కేకలు వేస్తుండగా ఆదారిన పోతున్న వారు బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను రక్షించారు. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. అన్వేష్ అనే ఒక విద్యార్థి చెయ్యి విరిగింది, బస్సు క్లీనర్ తలకు గాయం అయ్యింది. వీరందరినీ పిఠాపురంలో ఒక ప్రైయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ వారికి చికిత్స అందజేశారు. చెయ్యి విరిగిన విద్యార్థి కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాలం చెల్లిన బస్సు కావడంవల్లే..
ఈ స్కూల్ బస్సుకు రెండేళ్ల క్రితమే కాలం చెల్లినట్టు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆ స్కూలుకు చెందిన 8 బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటు సీజ్ చేయగా అపరాధ రుసుం చెల్లించి విడిపించుకుని తిప్పుతున్నట్టు చెబుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా అనుమతి లేని బస్సుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ రవాణాశాఖాధికారులు నిర్లక్ష్యంగా బస్సును వదిలివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తున్నారు.