‘కంతనపల్లి’పై టీ ఎంపీల్లో విభేదాలు | Telangana congress MPs cross swords over Kanthanapally project | Sakshi
Sakshi News home page

‘కంతనపల్లి’పై టీ ఎంపీల్లో విభేదాలు

Nov 2 2013 4:40 AM | Updated on Mar 18 2019 9:02 PM

‘కంతనపల్లి’పై టీ ఎంపీల్లో విభేదాలు - Sakshi

‘కంతనపల్లి’పై టీ ఎంపీల్లో విభేదాలు

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య విభేదాలు శుక్రవారం మీడియా సాక్షిగా బయటపడ్డాయి.

 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య విభేదాలు శుక్రవారం మీడియా సాక్షిగా బయటపడ్డాయి. కంతనపల్లి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్   ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య మీడియా ముఖంగానే వాదులాటకు దిగారు. అక్రమార్కులకు దోచిపెట్టేందుకే కంతనపల్లి ప్రాజెక్టును సీఎం కిరణ్ తెరపైకి తెచ్చారని పాల్వాయి ఆరోపించగా.. వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాలకు నీరందించే ఆ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించొద్దని రాజయ్య పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కిర ణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఎంపీ పొన్నం ప్రభాకర్ ఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దానికి రాజయ్య, పాల్వాయి హాజరయ్యారు.
 
 ఈ సందర్భంగా పాల్వాయి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ.. సీఎం తీరును ఎండగట్టారు. ప్రాజెక్టుల పేరిట కోట్లు దండుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, ఆ లక్ష్యంతోనే కంతనపల్లి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని, ఆ ప్రాజెక్టు స్థానంలో భారీ డ్యామ్ నిర్మించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కంతనపల్లిపై మాట్లాడొద్దని చెప్పినా మళ్లీ అదే మాట్లాడుతుండు. ప్రతిసారి దానిపై నివేదికలు ఇచ్చి ప్రాజెక్టును చెడగొడుతుండు. దానితో వరంగల్‌లో 12 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పినా పట్టించుకోవట్లేదు’’ అంటూ విసురుగా  వెళ్లిపోయారు. రాజయ్యను సముదాయించేందుకు పొన్నం ప్రయత్నించినా ఆయన వినిపించుకోలేదు. అనంతరం పాల్వాయి సమావేశాన్ని కొనసాగిస్తూ.. ప్రాజెక్టు వద్దని తాను చెప్పడం లేదని,  ప్రాజెక్టులపై ఎంపీలందరం కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చారు.  కాగా.. కేవలం సాంకేతిక అంశాలనే పాల్వాయి తప్పుపట్టారని, ప్రాజెక్టును కాదని పొన్నం చెప్పారు.
 
 నివేదికల విషయంలో సీఎంపై నమ్మకం లేదు: పొన్నం
 మంత్రుల బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తున్న నివేదికల విషయంలో సీఎంపై తమకు నమ్మకం లేదని పొన్నం వ్యాఖ్యానించారు. నిష్పక్షపాతంగా నివే దికలు అందించే బాధ్యతను ప్రధాన కార్యదర్శి తీసుకోవాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement