సా..గరం గరం

శుక్రవారం నాగార్జునసాగర్ డ్యామ్‌పై పరస్పరం దాడి చేసుకుంటున్న తెలంగాణ, ఏపీ పోలీసులు - Sakshi


నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల అధికారుల ఘర్షణ

కుడి కాలువకు నీటిని విడుదల చేసుకొనేందుకు ఏపీ యత్నం

వారిని అడ్డుకున్న తెలంగాణ అధికారులు..

పరస్పరం వాగ్వాదం, తోపులాట.. పోలీసుల ఘర్షణ

లాఠీలతో కొట్టుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు

సహనం కోల్పోయి నాలుగైదు సార్లు పరస్పర దాడులు

ఘటనపై సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు ఫోన్

నేడు గవర్నర్ సమక్షంలో సమావేశం కావాలని నిర్ణయం

‘జల జగడం’పై ఆరా తీసిన కేంద్రం..!
సాక్షి, నాగార్జునసాగర్, గుంటూరు, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరింతగా ముదిరింది. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రయత్నం... ఉద్రిక్తతకు దారితీసింది. సాగర్ ప్రాజెక్టుపైనే ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసుల వాగ్వాదం, తోపులాటతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం లాఠీలు ఝులిపించుకునే వరకు వచ్చింది. ఈ ఘటనలో పలువురికి గాయాలుకాగా... సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.మరోవైపు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖల మంత్రులు కూడా పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. మీరంటే మీరు పరిధి దాటుతున్నారంటూ ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఘర్షణపై సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. చివరకు ఈ పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది. శనివారం ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో నరసింహన్ సమక్షంలో ఇరువురు సీఎంలు సమావేశమై చర్చించుకోవాలని నిర్ణయించా రు. ఈ జల వివాదంపై కేంద్రం ఆరా తీసినట్లు సమాచారం. సాగర్ వద్ద ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర హోంశాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర అధికారులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.ఏం జరిగింది..?

నాగార్జునసాగర్ కుడి కాలువకు తెలంగాణ రాష్ట్రం నీటి విడుదలను నిలిపివేయడంతో... దీనిపై శుక్రవారం ఏపీ ప్రభుత్వం సమీక్షించింది. కుడికాలువకు ఆరు వేల క్యూసెక్కు ల నీటిని విడుదల చేయించాలని ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను ఆదేశించింది. ఈ మేరకు సాగర్ అధికారులకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసి... గుంటూరు జిల్లా విజయపురి సౌత్‌లోని రివర్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో వేచి ఉన్న అధికారులకు ఫ్యాక్స్ ద్వారా పంపారు.గురజాల ఆర్డీవో మురళి, ఈఈ జబ్బార్ ఈ ఉత్తర్వులు తీసుకుని సాగర్ డ్యామ్‌పైకి వెళ్లారు. తెలంగాణ అధికారులకు చూపి నీటిని విడుదల చేయాలని కోరారు. కానీ  నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదని తెలంగాణకు చెందిన సాగర్ డీఈఈ విజయకుమార్, మిర్యాలగూడ ఆర్డీవో కిషన్‌రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది. కుడి కాలువ పరిధిలోని నీటిని విడుదల చేసుకునే అధికారం తమకు ఉందని ఏపీ అధికారులు వాదించారు. కుడి కాలువ గేట్లు ఎత్తేందుకు సిద్ధమయ్యారు.అయితే ఇది మీ ప్రాంతం కాదని.. రాష్ట్ర విభజనతో 13 క్రస్ట్‌గేట్లు, కుడి కాలువ గేట్లు, కుడి కాలువ జల విద్యుత్ కేంద్రం నిర్వహణ తమ పరిధిలోకి వచ్చాయని తెలంగాణ అధికారులు వాదించారు. ఇదే సమయంలో తెలంగాణ పోలీసులు ఏపీ అధికారులకు అడ్డువచ్చారు. గేట్లు తీయడానికి వీల్లేదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.అయితే నిబంధనల ప్రకారం నీటి విడుదలకు గేట్లు తీసుకునే అధికారం తమకు ఉందంటూ ఏపీలోని గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు చెబుతుండగా... నల్లగొండ జిల్లా హాలియా సీఐ పార్థసారథి కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో మా ప్రాంతంలో మీ పెత్తనం ఏమిటంటూ మాచర్లరూరల్ సీఐ చినమల్లయ్య ప్రశ్నించిన తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం మరింత పెరి గింది. చివరికి ఇరువైపులా పోలీసులు సహనం కోల్పోయి.. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. పరిస్థితి అదుపుతప్పి పరస్పరం లాఠీలు ఝులిపించుకునేదాకా వెళ్లడంతో... తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారులు సర్దిచెప్పినప్పటికీ ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం దాడులకు దిగారు.రాత్రిదాకా ఉద్రిక్తత..

శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాగర్ డ్యాంకు ఇరువైపులా హైడ్రామా జరిగింది. కుడి కాలువకు చెందిన లింగంగుంట్ల ఎస్‌ఈ కృష్ణారావు డ్యామ్‌పైకి వస్తుండగా... డ్యామ్ భద్రతా సిబ్బంది ఆయనను డ్యామ్‌పైకి రాకుండా అడ్డగించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వందలాది మంది గేట్ల వద్దకు వచ్చి వాదనకు దిగారు. దీంతో కృష్ణారావును డ్యామ్‌పైకి అనుమతించారు. ఈ సమయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు మరింతగా భావోద్వేగాలకు లోనై లాఠీలతో పరస్పరం మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఇరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి.డ్యామ్ ఎస్‌ఈ విజయభాస్కర్‌ను సైతం ఆయనకు డ్యాంపైకి రావడానికి అధికారం లేదని ఏపీ అధికారులు అనడంతో అక్కడా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఈ సమయంలోనూ ఇరు రాష్ట్రాల పోలీసులు తుపాకులు పక్కనపెట్టి పరస్పరం తోసుకుంటూ లాఠీలు తీసుకుని దాడులు చేసుకున్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో గుంటూరు రూరల్ ఎస్పీ రామకృష్ణ, నల్లగొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు, ఓఎస్డీ రాధాకిషన్‌రావు తదితరులు ప్రాజెక్టు పైకి చేరుకుని ఇరిగేషన్ అధికారులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.శ్రీశైలంతో మొదలు..

రాష్ట్ర విభజన అనంతరం ఏదో ఒక విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. కృష్ణా జలాల వినియోగంపై దాదాపు 6 నెలలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. గత అక్టోబర్‌లో రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉన్నప్పుడు.. విద్యుత్ సరఫరాను ఏపీ నిలిపివేయడాన్ని తెలంగాణ తీవ్రంగా పరిగణిం చింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోని నీటితో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. తమ వాటా నీటిని తాము వాడుకుంటున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. అయితే రాయల సీమకు అత్యవసరమైన శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని విద్యుత్ ఉత్పత్తితో దిగువకు వదలడాన్ని ఏపీ తీవ్రంగా తప్పుబట్టింది. అయి తే ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం, వర్షాలు కురవడంతో శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది.సాగర్‌తో తారస్థాయికి..

శ్రీశైలంలో సద్దుమణిగిన వివాదం నాగార్జునసాగర్ నీటి వినియోగం విషయంలో మళ్లీ రాజుకుంది. సాగర్ కుడి, ఎడమ కాలువల కింద రబీ అవసరాలను త్వరగా పరిశీలించి నీటిలెక్కలపై తేల్చాలంటూ ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్‌లో తెలంగాణను కోరింది. ఈ మేరకు నీటి లెక్కలపై కసరత్తు చేసిన తెలంగాణ... కృష్ణాలో గుండుగుత్తగా జరిపిన కేటాయింపుల్లో ఏపీకి 512.04 టీఎంసీలు (63.14 శాతం), తెలంగాణకు  298.96 టీఎంసీలు (36.86 శాతం) దక్కుతాయని తేల్చింది.ప్రత్యేకంగా సూ చించిన ప్రాజెక్టులకు మినహా మిగతా ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని ఆ రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకోవచ్చన్న బచావత్ అవార్డును ప్రస్తావిస్తూ... సాగర్ ఎగువన వాడుకోలేకపోయిన 70 టీఎంసీలను సాగర్ నుంచి వాడుకుంటామని స్పష్టం చేసింది. ఇక ఈ ఏడాది కృష్ణా నదిలో లభ్యమైన 552 టీఎంసీల నీటిలో ఏపీకి 322 టీఎంసీలు, తెలంగాణకు 229.5 టీఎంసీలు వాటాగా వస్తాయని... ఈ లెక్కన ఏపీ ఇప్పటికే అదనంగా 43.13 టీఎంసీల నీటిని వాడుకుందని పేర్కొంది. సాగర్ కుడి కాలువకు 132 టీఎంసీల కేటాయింపు ఉండగా... 138 టీఎంసీల మేర వాడుకున్నారని, కృష్ణా డెల్టాలో 152 టీఎంసీల మేర వాడుకునే అవకాశం ఉండగా... 170 టీఎంసీలను ఏపీ వాడుకుందని తెలంగాణ వాదించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top