శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత కేంద్రం సమీపంలో శుక్రవారం దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా...
శ్రీశైలం : శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత కేంద్రం సమీపంలో శుక్రవారం దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు ఆసాలి వసంతరావుకు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమ యాత్రలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు బన్నూరు రామలింగారెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం వసంతరావు నివాసగృహం వద్ద ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించిన అనంతరం అంతిమయాత్ర ప్రారంభమయ్యింది.
పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనల అనంతరం వసంతరావు మృతదేహాన్ని ఖననం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి.. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో ఫోన్ ద్వారా వసంతరావు సతీమణి శైలజ, కుమారులు ప్రవీణ్, రవితేజ, కుమార్తె మానసలతో మాట్లాడించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. కర్నూలు జిల్లా యాత్రకు వచ్చినప్పుడు సున్నిపెంట గ్రామానికి వచ్చి పరామర్శిస్తానని భరోసానిచ్చారు.