breaking news
Vasantha Rao
-
వీడిన మిస్టరీ
వైఎస్ఆర్ సీపీ కర్నూలు జిల్లానేత హత్యకేసును ఛేదించిన పోలీసులు రాజకీయ కక్షలతోనే మట్టుబెట్టారు పోలీసుల అదుపులో నిందితులు అచ్చంపేట రూరల్ : వైఎస్ఆర్ సీపీ కర్నూలు జిల్లా నేత వసంతరావు హత్యకేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పాతకక్షల నేపథ్యంలోనే మట్టుబెట్టారని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రధాన నిందితుడు బట్టి వెంకట్‌రెడ్డితో పాటు అతడి అనుచరులను తమ అదుపులోకి తీసుకున్నారు. జిల్లా అదనపు ఎస్పీ మల్లారెడ్డి ఆదివారం అచ్చంపేటలో వివరాలు వెల్లడించారు. ఈనెల 15న అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో హన్మకొండ మలుపు వద్ద వసంతరావును హత్యచేసిన సంఘటన కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సంచలనం రేకెత్తించింది. కాగా, ఈ కేసును జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతుడు వసంతరావుకు శత్రువులు ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు సాగింది. సున్నిపెంటకు చెందిన బట్టి వెంకట్‌రెడ్డి, వసంతరావుకు రాజకీయంగా కక్షలు ఉన్నాయని పోలీసులు తెలుసుకున్నారు. వెంకట్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నాడని పలుమార్లు వసంతరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశాడు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అతడిపై వెంకట్‌రెడ్డి మరింత కక్ష పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు. హత్యచేయాలని భావించి పలుమార్లు విఫలమయ్యాడు. హత్య జరిగిందిలా.. ఈ క్రమంలో 15న ఉదయం 6గంటల సమయంలో వసంతరావు షిష్టుకారులో డ్రైవర్ శివకుమార్‌తో కలిసి హైదరాబాద్‌కు బయలు దేరుతుండగా ఈగలపెంట ప్రాంతంలోని లింగాల ఘాట్ హన్మకొండ మలుపువద్ద వెంకట్‌రెడ్డి, అతడి అనుచరులు రామసుబ్బారెడ్డి, నాగేశ్వర్రావు, చిన్నన్న, రూప్రాషానీ, చిన్న వెంకటేశ్వర్లు, గుండయ్య యాదవ్, గురువయ్య, భరత్ కాపుకాచి తాము వెంట తెచ్చుకున్న ఫోర్స్-1 కారుతో వసంతరావు కారును ఢీకొట్టి బయటకు లాగి మారణాయుధాలతో హత్యచేశారు. ఇదిలాఉండగా, శనివారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెలుగుచూశాయని అదనపు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. వారి నుంచి కత్తులు, గొడ్డలి, తపంచా, పిస్టల్, రెండు రివాల్వర్లు, మందుగుండు సామగ్రి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులను సోమవారం అచ్చంపేట కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు వెంకట్‌రెడ్డి గతంలో సీపీఐ ఎంఎల్లో పనిచేశాడని తెలిపారు. పోలీసుల కృషి భేష్ ఈ కేసును చేధించిన నాగర్‌కర్నూల్ డీఎస్పీ గోవర్దన్, అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు, ఈగలపెంట, అమ్రాబాద్, సిద్ధాపూర్ పోలీసుల కృషిని ప్రశంసించారు. వారికి పోలీసుశాఖ నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ డీఎస్పీ గోవర్దన్, అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వసంతరావుకు కన్నీటి వీడ్కోలు
శ్రీశైలం : శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత కేంద్రం సమీపంలో శుక్రవారం దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆసాలి వసంతరావుకు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమ యాత్రలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు బన్నూరు రామలింగారెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం వసంతరావు నివాసగృహం వద్ద ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించిన అనంతరం అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. పాస్టర్ల ప్రత్యేక ప్రార్థనల అనంతరం వసంతరావు మృతదేహాన్ని ఖననం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫోన్ ద్వారా వసంతరావు సతీమణి శైలజ, కుమారులు ప్రవీణ్, రవితేజ, కుమార్తె మానసలతో మాట్లాడించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. కర్నూలు జిల్లా యాత్రకు వచ్చినప్పుడు సున్నిపెంట గ్రామానికి వచ్చి పరామర్శిస్తానని భరోసానిచ్చారు. -
వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
వేట కొడవళ్లతోనరికి చంపిన ప్రత్యర్థులు మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన మన్ననూర్: కర్నూలు జిల్లా వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంతరావు (54) శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లాలోని సున్నిపెంట నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద ప్రత్యర్థులు దారికాచి వేటకొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు కథనం ప్రకారం.. సున్నిపెంట మండల కేంద్రానికి చెందిన వసంతరావు(54) సొంత పనిమీద హైదరాబాద్‌కు కారులో డ్రైవర్ శివతో కలసి బయలుదేరారు. ఆయన వాహనం ఈగలపెంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మకొండ వద్దకు రాగానే అప్పటికే మాటువేసి ఉన్న సుమారు 10 మంది వసంతరావుపై వేటకొడవళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వసంతరావు వైఎస్సార్సీపీలో చురుకైన నాయకుడు. మృతుడికి భార్య శైలజ తో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈగలపెంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వసంతరావు మృతదేహాన్ని మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజూర్ అహ్మద్, కార్యదర్శి కొండూరి చంద్రశేఖర్‌తో పాటు స్థానిక నాయకులు సందర్శించారు.