అడ్డతీగల (రంపచోడవరం): తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం డి.భీమవరం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పద్యం అప్పజెప్పలేదని తెలుగు ఉపాధ్యాయుడు 24 మంది విద్యార్థులను చెప్పుతో కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థుల కథనం మేరకు.. గత మంగళవారం తెలుగు ఉపాధ్యాయుడు గాంధీ 10వ తరగతి విద్యార్థులను ఓ పద్యం చదివి గురువారం నాటికి అప్పజెప్పాలని ఆదేశించారు. గురువారం ఉపాధ్యాయుడు తరగతికిరాగా, ఫార్మేటివ్ పరీక్షలు జరుగుతున్నందున పద్యం చదవలేదని విద్యార్థులు జవాబిచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు కాలి చెప్పు తీసి తమను చితకబాదారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం బయటకు చెబితే పాఠశాల పరువు పోతుందని కొందరు ఉపాధ్యా యులు విద్యార్థులను సముదాయించారు. చివరకు విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఈ ఘటనపై సహాయ గిరిజన సంక్షేమ అధికారి శంభుడు శనివారం పాఠశాలలో విచారణ నిర్వహించారు.