పాఠశాలకు పచ్చనేత షాక్‌

TDP Worker Cheted Money Of Government School - Sakshi

అధికారుల ఉదాసీనం.. ప్రజా ప్రతినిధుల సహకారంతో ఓ కాంట్రాక్టర్‌ ప్రభుత్వ పాఠశాలకు షాక్‌ ఇచ్చాడు. భవన సముదాయం నిర్మాణం కాంట్రాక్టు పొందిన సదరు టీడీపీ నేత తాను బిల్లు చెల్లిస్తానని నమ్మపలికి స్కూల్‌ మీటర్‌ నుంచి ఇష్టారీతిన కరెంటు వాడుకుని తీరా అవసరం తీరాక తనకు సంబంధం లేదని తెగేసి చెప్తున్నాడు. ఆ బిల్లు మొత్తం రూ. 2.5 లక్షలు బకాయిపడింది. అంతలా బిల్లు పెరిగిపోతుంటే రెండేళ్ల పాటు స్కూలు కమిటీవారు, అధికారులు ఏంచేస్తున్నట్లు.. నెల బిల్లు చెల్లించకపోతేనే జరిమానాలంటూ నానాయాగీ చేసి కనెక్షన్‌ కట్‌ చేసే విద్యుత్‌ శాఖ అధిరులు ఏందుకు ఊరుకున్నారో అర్థంకాని పరిస్థితి. ఆలస్యంగా నిద్రమేలుకున్న విద్యుత్‌ అధికారులు కాంట్రాక్టర్‌ తన పని ముగించుకుని వెళ్లిపోయాక పాఠశాలకు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

మార్టూరు(ప్రకాశం) : మండల కేంద్రమైన మార్టూరు జాతీయ రహదారిని ఆనుకొని మద్ది సత్యనారాయణ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో 850 మందికిపైగా విద్యార్థులున్నారు. పాఠశాల హైవే పక్కనే ఉండటంతో రోడ్డుకు అభిముఖంగా పడమరవైపు షాపింగ్‌కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడితే పాఠశాలకు రక్షణగా, ఆదాయవనరుగా కూడా ఉంటుందని రెండేళ్ల కిందట రూ. 50 లక్షల జిల్లా పరిషత్‌ నిధులతో గదుల నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను మార్టూరు తాజామాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శివరాత్రి ఈశ్వరమ్మ భర్త శ్రీనివాసరావు దక్కించుకోవటం గమనార్హం.  

ఆయన వృత్తిరీత్యా బేల్దారిమేస్త్రి కావటంతో పాటు సిమెంట్, ఇసుక పరిశ్రమ కూడా ఉంది. మెత్తం 18 గదుల నిర్మాణానికి అవసరమైన కరెంట్‌ను పాఠశాలకు చెందిన కరెంట్‌ సర్వీస్‌ నంబర్‌ 646 నుంచి సదరు జెడ్పీటీసీ భర్త శ్రీనివాసరావు రెండేళ్లుగా వినియోగించుకొని ఇటీవలే నిర్మాణం పూర్తిచేశాడు. కరెంట్‌బిల్లు తాను చెల్లిస్తానని ప్రధానోపాధ్యాయుడు డేవిడ్‌కు మెదట్లో చెప్పిన కాంట్రాక్టర్‌ క్రమేపి దాటవేస్తూ సమయం గడిపినట్లు హెచ్‌ఎం చెప్తున్నారు. సాధారణ పౌరులు ఒకనెల కరెంట్‌బిల్లు చెల్లించకపోతేనే మీటర్‌ కనెక్షన్‌ తొలగించే విద్యుత్‌శాఖ అధికారులు గత రెండేళ్లుగా కరెంట్‌బిల్లు విషయమై ఎవరినీ ప్రశ్నించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో ఏప్రియల్‌ 30వ తేదీనాటికి పాఠశాల కరెంట్‌మీటర్‌ బిల్లు అక్షరాల రూ. 2.50 లక్షలు రావటం, జూన్‌ నెల చివరికి రూమ్‌ల నిర్మాణం పూర్తికావటం జరిగింది. 

ఈ నేపథ్యంలో గత మేనెల 10వ తేదీ తాజామాజీ జెడ్పీచైర్మన్‌ ఈదర హరిబాబు పాఠశాలను సందర్శించినప్పుడు ప్రధానోపాధ్యాయుడు డేవిడ్, ఇతర ఉపాధ్యాయులతో కలిసి కరెంట్‌బిల్లు విషయం హరిబాబు వద్ద ప్రస్తావించారు. అందుకు స్పందించిన హరిబాబు కరెంట్‌బిల్లు నీవే చెల్లించవల్సిందిగా కాంట్రాక్టర్‌ను ఆదేశించగా అందుకు అతను సరే అనటం జరిగింది. జిల్లా పరిషత్‌ పాలకవర్గం గడువు ఈనెల మెదటివారంలో ముగిసే వరకు తాత్సారం చేసిన కాంట్రాక్టర్‌ ఇప్పుడు కరెంట్‌బిల్లు తానుచెల్లించలేనని మీరే చెల్లించుకోండి అంటూ పాఠశాల యాజమాన్యంతో చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో గతవారం విద్యుత్‌ ఏఈఓ నాంచారరావు తమ సిబ్బందితో పాఠశాల మీటర్‌ కనెక్షన్‌ను తప్పించటం జరిగింది. 

తాగునీటికి తప్పని ఇబ్బందులు:
కరెంట్‌ లేక పాఠశాలలోని వాటర్‌ప్లాంటు పనిచేయక తాగునీటికి, మరుగుదొడ్ల అవసరాలకు, కంప్యూటర్‌ తరగతులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రధానోపాధ్యాయులు డేవిడ్‌ తెలిపారు. పాఠశాల యాజమాన్యం త్వరలో బిల్లు చెల్లిస్తామని విద్యుత్‌శాఖ అధికారులను ప్రత్యేకంగా అభ్యర్థించటంతో తాత్కలికంగా కనెక్షన్‌ తిరిగి ఇచ్చినట్లు హెచ్‌ఎం తెలిపారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్‌ గదుల నిర్మాణం తాలుకా బిల్లులు మెత్తం పూర్తిగా వసూలు చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. రూ. 80 లక్షల కాంట్రాక్ట్‌ పూర్తిచేసుకొని బిల్లులు వసూలు చేసుకున్న శ్రీనివాసరావు పాఠశాల కరెంట్‌బిల్లు చెల్లించకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయటంపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

కాంట్రాక్టరే చెల్లించాలి
కరెంట్‌మీటర్‌లో లోపం ఉందని మెదట కాంట్రాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పటంతో ఏఈ నాంచారరావు మీటర్‌ పరీక్షించి బాగానే ఉందని రూ. 2 లక్షల 50 వేలు చెల్లించాల్సిందేనన్నారు. బిల్లు చెల్లించకపోవడంతో మీటర్‌ కనెక్షన్‌ తప్పించారు. ప్రత్యేకంగా అభ్యర్థించటంతో తాత్కలికంగా కనెక్షన్‌ పునర్ధురించారు. కరెంట్‌బిల్లు చెల్లించవల్సింది కాంట్రాక్టర్‌ శ్రీనివాసరావే. 
దుడ్డు డేవిడ్‌ ప్రధానోపాధ్యాయులు

బిల్లుకు నాకు సంబంధం లేదు
విద్యుత్‌ బిల్లుకు సంబంధించి రూ. 25 వేలు ప్రధానోపాధ్యాయుడు డేవిడ్‌కు చాలా కాలం క్రితమే ఇచ్చాను. ప్రస్తుతం చెల్లించాల్సిన బిల్లుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పాఠశాల యాజమాన్యమే చెల్లించుకోవాలి. 
-శివరాత్రి శ్రీనివాసరావు కాంట్రాక్టర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top