తాడికొండలో పోటీకి ‘దేశం’ రెబల్‌ రెడీ

Tdp Rebel Ready to Compete In Tadikonda - Sakshi

సాక్షి, తాడికొండ: స్థానిక తెలుగుదేశం పార్టీలో అసమ్మతి మళ్లీ రేగింది. సీటు కేటాయింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట్లో ఓ నిర్ణయం... తరువాత మరో నిర్ణయం ప్రకటించడంతో పరిస్థితి గందరగోళానికి దారితీసింది. తొలి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ను వ్యతిరేకిస్తున్న జెడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు వర్గం ఆయనకు సీటు రాకుండా చేయడంలో తమ పంతం నెగ్గించుకున్నారు. 
అయితే, ఈ సంతోషం తాత్కాలికమే అయింది. అసమ్మతి వర్గానికి దీటుగా శ్రావణ్‌ అనుకూల వర్గం పావులు కదిపి తిరిగి సీటు శ్రావణ్‌కు ఇప్పించుకుని పూర్ణచంద్రరావు వర్గానికి షాక్‌ ఇచ్చారు. సీఎం నివాసం ముందు మూడు రోజుల పాటు నిరసన ధర్నాలు నిర్వహించడంతో పాటు నాలుగు మండలాల ఎంపీపీలు, ఇద్దరు మార్కెట్‌ యార్డు చైర్మన్లు, 44 మంది సమన్వయ కమిటీ సభ్యులు, మూడు మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ వాసిరెడ్డి జయరామయ్య పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని సీఎంను బెదిరించారు.

దీంతో పునరాలోచనలో పడిన ముఖ్యమంత్రి ఉన్న పళంగా మాల్యాద్రిని అక్కడి నుంచి తిరిగి బాపట్ల ఎంపీ స్థానానికి పంపి, పూర్ణచంద్రరావు వర్గానికి ఝలక్‌ ఇచ్చారు. తెనాలి శ్రావణ్‌ను తిరిగి అభ్యర్థిగా నిలపడంతో పూర్ణచంద్రరావు వర్గానికి ముద్ద మింగుడుపడటం లేదు. తమకు తీరని అవమానం జరిగిందని భావించిన అసమ్మతి వర్గం దూకుడు పెంచింది. ముందో మాట, వెనుకో బాట నడుస్తున్న అధినేత చంద్రబాబు వైఖరితో విసిగిపోయిన నాయకులు ఆయనతో మాట్లాడినా తమకు ఒరిగేందేమీ లేదనుకున్నారో ఏమో.. మంగళవారం తాడికొండలోని యెడ్డూరి హనుమంతరావు నివాసంలో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ రెబల్‌ అభ్యర్థిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. పెదపరిమి గ్రామ మాజీ సర్పంచ్‌ సర్వా యలమంద కుమారుడు సర్వా శ్రీనివాసరావును రెబల్‌ అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్న అనంతరం అనుకున్నదే తడవుగా జెడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు అనుచరగణంతో జిల్లా పరిషత్‌ కార్యాలయానికి చేరుకొని రాజీనామాను సమర్పించేందుకు యత్నించినా కలెక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోడంతో వెనుదిరిగారు.

అయితే, తమ మనోభావాలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం బాధించిందని అసమ్మతి వర్గం వాపోతున్నారు. శ్రావణ్‌కుమార్‌కు సహకరించేది లేదని, రెబల్‌ అభ్యర్థిని ఇండిపెండెంట్‌గా బరిలో దించి గెలిపించుకుంటామంటూ చెబుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. ఓ వైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ 21వ తేదీన నామినేషన్‌ వేసేందుకు సిద్ధం కాగా టీడీపీలో నెలకొన్న అనిశ్చితి కారణంగా క్యాడర్‌లో నిరుత్సాహం నెలకొంది. సొంత పార్టీ నేతలే అసలు అభ్యర్థి ఎవరు, ఎప్పుడు నామినేషన్‌ వేస్తారు, ప్రచారం ఉందా లేదా అంటూ పలువురు బహిరంగంగా వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటుండటంతో టీడీపీకి క్యాడర్‌ బలహీనంగా మారుతుంది. రాజధాని సీటు కావడంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు కలసికట్టుగా విజయం వైపుగా అడుగులు వేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top