ఛూ ‘మంత్రి ఖాళీ’!

tdp minorty shareef gets council chairman post - Sakshi

జిల్లాకు మొండిచెయ్యి

మంత్రివర్గ విస్తరణలో షరీఫ్‌కు అన్యాయం

మండలి చైర్మన్‌ పదవికి దక్కిన హామీ

మొడియంనీ పట్టించుకోలేదు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: తాజా మంత్రివర్గ విస్తరణలో జిల్లా నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపించారు. జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న షరీఫ్‌కు మైనారిటీ కోటాలో చాలా కాలంగా మంత్రి పదవి ఇస్తామని ఊరిస్తూ వచ్చారు. చివరికి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయనను పక్కన పెట్టి రాయలసీమకు చెందిన వారికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు.  ఎస్టీ కోటాలో పోలవరం నుంచి మొడియం శ్రీనివాస్‌ ఒక్కరే అధికార పార్టీ నుంచి గెలుపొందారు. అయితే గత నాలుగేళ్లలో ఎస్టీల నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. గత విస్తరణలో మొడియంకు మంత్రి పదవి వస్తుందని ఆశించినా అది దక్కలేదు. తాజాగా వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని మావోల చేతిలో చనిపోయిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించడంపైజిల్లా నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  

షరీఫ్‌కు మరో‘సారీ’..!    
జిల్లాకు చెందిన మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి మొండిచెయ్యి చూపించారు. చివరిసారిగా జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించడం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తూ, పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న షరీఫ్‌కు మంత్రివర్గంలో స్థానం ఇక దక్కే  అవకాశం లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం. మైనార్టీ వర్గం నుంచి షరీఫ్‌కు బెర్త్‌ ఖాయం చేస్తారని  మూడేళ్లుగా ప్రచారం సాగుతోంది. 

ఈ మూడేళ్ల కాలంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన ప్రతిసారీ షరీఫ్‌కు మంత్రి పదవి ఖాయం అని పార్టీ అధిష్టానం, సాక్షాత్తూ చంద్రబాబునాయుడు ఊరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గంలో మైనార్టీల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో తనపై ఖచ్చితంగా చంద్రబాబు కరుణ చూపిస్తారని షరీఫ్‌ కూడా ఆశగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి షరీఫ్‌ పార్టీకి పలు రూపాల్లో సేవలు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ముందుగానే పార్టీలో చేరిన వ్యక్తి షరీఫ్‌. 1982లో ఎన్టీఆర్‌ పార్టీ ప్రకటన చేయగానే, నరసాపురంలో 11 మందితో పార్టీలో చేరారు. 

కొత్తపల్లి లాంటి వారూ షరీఫ్‌ తరువాత వచ్చినవారే. 1990–97 మధ్య పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత 1997 నుంచి 2000 సంవత్సరం వరకూ మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, 2002లో స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేశారు. 2011లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ అయ్యారు.  గుంటూరులో టీడీపీ అట్టహాసంగా మైనార్టీ సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంలో అయితే అదే వేదికపై షరీఫ్‌కు మంత్రి పదవిని చంద్రబాబు ప్రకటిస్తారని ప్రచారం సాగింది. 

షరీఫ్‌ వైఖరిలో మార్పు 
మంత్రి పదవి ఊహాగానాలు రాగానే షరీఫ్‌ కూడా తమ అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు, ప్రతిపక్షంపై వివాదాస్పదమైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సౌమ్యుడిగా పేరున్న షరీఫ్‌ వైఖరిలో మార్పు రావడం అప్పటిలో పెద్ద చర్చనీయాంశమైంది. పదవి కోసం పడుతున్న తంటాలుగా షరీఫ్‌ కొత్త వైఖరిని రాజకీయవర్గాలు విశ్లేషించాయి. కానీ అవేమీ చంద్రబాబును ఆకర్షించలేదు. పార్టీకి వీరవిధేయుడైనా మైనార్టీ కార్డు కూడా చంద్రబాబుకు కనిపించలేదు.  మొత్తంగా షరీఫ్‌కు ఇక ఛాన్స్‌ లేదని తేలిపోవడంతో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి శాసనమండలి చైర్మన్‌ ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాను మంత్రి పదవిని ఆశించిన మాట వాస్తవమేనని, మండలి చైర్మన్‌ పదవి ఇచ్చారని అన్నారు. పదవి కావాలని చంద్రబాబును తాను ఎప్పుడూ అడగలేదని పేర్కొన్నారు.

ఎస్టీల నుంచి ఏకైక అధికారపార్టీ ఎమ్మెల్యే అయినా..
మరోవైపు రాష్ట్రంలోనే ఎస్టీల నుంచి గెలిచిన ఏకైక అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన మొడియం శ్రీనివాస్‌కు కూడా మంత్రి పదవి చేతిదాకా వచ్చి చేజారిపోయింది. గత మంత్రివర్గ విస్తరణ సమయంలో ముందురోజు సాయంత్రం మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారు అయ్యింది. అర్జెంట్‌గా వచ్చి ముఖ్యమంత్రిని కలవాలని పేషీ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయన బయలుదేరి వెళ్లారు. ఈలోగానే సమీకరణాలు మారి బీసీ కోటాలో జిల్లా నుంచి పితాని సత్యనారాయణకు పదవి దక్కింది. ఈసారి అసలు ఎమ్మెల్యే కాని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడంతో మొడియం అసంతృప్తికి గురైనట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top