గ్రామ వలంటీర్‌ పోస్టుల కోసం టీడీపీ నేతల హైడ్రామా!

TDP Leaders Interfering In Grama Volunteer Merit List At Chirala - Sakshi

వలంటీర్ల ఎంపికలో రెండు జాబితాలు విడుదల చేసిన ఓ అధికారి

ఆయన తీరుపై విమర్శలు

శిక్షణ కేంద్రం వద్ద వాగ్వాదం

సాక్షి, చీరాల (ప్రకాశం): చీరాల మండల పరిషత్‌ అబివృద్ధి అధికారి వ్యవహరిస్తున్న తీరుతో వలంటీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు అన్నిశాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామ వలంటీర్ల ఎంపిక జాబితా జిల్లా అధికారులకు పంపినది ఒకటి ఉండగా.. టీడీపీ నేతల బెదిరింపులకు, ఆదేశాలకు తలొగ్గి వారి మెప్పు పొందేందుకు మరొక జాబితాను తయారు చేశాడు ఆ అధికారి. దీంతో బుధవారం చీరాల గ్రామ వలంటీర్ల శిక్షణ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు తమకు సంబంధించిన అనుచరులతో కలిసి హై డ్రామా సృష్టించారు. ఆదివారం ప్రకటించిన జాబితా ఫైనల్‌కాగా సోమవారం అర్ధరాత్రి వరకు టీడీపీ నేతలు ఎంపీడీవో కార్యాలయంలో నానా హంగామా సృష్టించి బెదిరింపుకుల పాల్పడటంతో ఎంపీడీవో మరొక జాబితా తయారు చేసిన విషయం తెలిసిందే.

అయితే బుధవారం చీరాల ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల గేటు ముందు టీడీపీకి చెందిన నాయకులు తమ అనుచరులతో కలిసి నానా హైరానా సృష్టించారు. చీరాల్లో పోలీసులు 30 యాక్టు, 144 సెక్షన్‌ను విధించడంతో తహసీల్దార్‌ కార్యాలయం గేటు ముందు వన్‌టౌన్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తనిఖీ చేసిన అనంతరమే పోలీసులు వలంటీర్లను శిక్షణ కేంద్రం లోపలికి అనుమతించారు. ఒన్‌టౌన్‌ సీఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్, రాజేశ్వరరావు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మండలంలోని తోటవారిపాలెం, తదితర గ్రామాలకు చెందినవారు వలంటీర్‌ ఇంటర్వ్యూలో అర్హత సాధించామంటూ మరో జాబితాలతో మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బాషా,  కొందరు టీడీపీ నేతలను వెంటబెట్టుకుని శిక్షణ కేంద్రంలోపలికి వెళ్లేందుకు యత్నించారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వలంటీర్లుగా నియామకం పొందిన జాబితా చూపించాలని కోరారు. దీంతో వారు తమ వద్ద ఉన్న జాబితా చూపించగా మండల పరిషత్‌ సిబ్బంది వద్ద ఉన్న తుది జాబితాతో సరిపోకపోవడంతో వారిని శిక్షణకు అనుమతించలేదు. ఒక దశలో టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని పోలీసులు హెచ్చరించి పంపించారు. టీడీపీ నేతలు మాత్రం దురుసుగా వ్యవహరించడంతో కొందరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  రెండు జాబితాలు తయారు చేసిన ఎంపీడీవో నమ్మక ద్రోహం చేశారని వారు వాపోయారు.

మిగిలిన ఆ 61 పోస్టులు ఎక్కడ?
446 పోస్టులకు గాను 385 మందిని గ్రామ వాలంటీర్లుగా ఎంపిక చేశారు. మిగిలిన 61 మందిని ఎంపిక చేయకండా ఎంపీడీవో అవకతవకలకు పాల్పడుతున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. చీరాల ఇన్‌చార్జి ఎంపీడీవో వ్యవహరిస్తున్న తీరు పలు అనుమనాలను రేకెత్తించడంతో పాటు, టీడీపీ నాయకులు సూచించిన వారిని నియామకం చేసేందుకు పాల్పడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top