టీడీపీ నేతలు కక్ష కట్టి వేధించారు

TDP Leaders Harassments on YSRCP Supporters in East Godavari - Sakshi

అడుగడుగునా అవమానించారు

సమావేశంలో కంటతడి పెట్టిన యానిమేటర్లు

తూర్పుగోదావరి, రాయవరం (మండపేట): ‘వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు అనుకున్న యానిమేటర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. అడుగడుగునా అవమానించారు. టీడీపీ హయాంలో అరకొర వేతనాలకు పనిచేసిన తమను ఇబ్బందులకు గురి చేశారంటూ పలువురు యానిమేటర్లు కన్నీళ్ల పర్యంతమయ్యారు. స్థానిక వెలుగు కార్యాలయంలో గురువారం యానిమేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జెడ్పీటీసీ చిన్నం అపర్ణా పుల్లేష్, ఎంపీటీసీ సభ్యులు సిరిపురపు శ్రీనివాసరావు, అంపోలు సాయిలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి(చినకాపు) తదితరులు హాజరయ్యారు. సమావేశంలో యానిమేటరు కోట సత్యవతి మాట్లాడుతూ తాను వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరురాలన్న ఉద్దేశంతో ఉద్యోగం నుంచి తీయించేందుకు టీడీపీ వర్గాలు విఫలయత్నం చేశాయని విలపిస్తూ చెప్పారు. వెదురుపాకకు చెందిన పసగాడి వెంకటలక్ష్మి మాట్లాడుతూ తనను టీడీపీ నేతలు ఇబ్బందులకు గురి చేసిన వైనాన్ని వివరించి కన్నీళ్ల పర్యంతమైంది.

దివ్యాంగురాలినని కూడా చూడకుండా వేధించారన్నారు. మాచవరానికి చెందిన పి.సూర్యకుమారి తాను పడిన ఇబ్బందులను వివరించారు. కురకాళ్లపల్లి, వెంటూరు గ్రామాలకు యానిమేటర్‌గా పనిచేసిన తనను వెంటూరు నుంచి టీడీపీ ప్రజాప్రతినిధి పట్టుపట్టి తప్పించారన్నారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరురాలన్న కక్షతోనే వేధించారని ఆమె వాపోయింది. అదే సందర్భంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు కనీస వేతనం ఇవ్వడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. యానిమేటర్ల బాధలపై ప్రతిస్పందించిన జెడ్పీటీసీ పుల్లేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో ఎవరిపైనా వేధింపులు ఉండవని అన్నారు. యానిమేటర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీటీసీ సభ్యులు సిరిపురపు శ్రీనివాసరావు, అంపోలు సాయిలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడునల్లమిల్లి వెంకటరెడ్డి(చినకాపు) తదితరులు భరోసా ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top