వధూవరులపై టీడీపీ నేతల దాష్టీకం

TDP Leaders Attack On New Couple In Krishna - Sakshi

కులాలు వేరుకావడంతో పెళ్లికి నిరాకరించిన అమ్మాయి బంధువులు

ఈ నెల 20న వివాహం చేసుకున్న ప్రేమికులు

వరుడిపై 20 మంది దాడి

కృష్ణా,కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం) : పరువు పెళ్లి నవవరుడి ప్రాణంమీదకు తెచ్చింది. బందరు మండలం చిన్నాపురానికి చెందిన వడ్డి హరిసాయి ఆక్వా ఫుడ్‌ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. ఏలూరు సీఆర్‌ రెడ్డి కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్న అదే గ్రామానికి చెందిన ఓ మండల స్థాయి టీడీపీ నేత తమ్ముడు కాగిత నారాయణ కూతురు కాగిత శోభనతో అతనికి మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త  ప్రేమగా మారింది. ఇటీవల వారిరువురూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలకు విషయం చెప్పారు. శోభన తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఈ నెల 19వ తేదీ ఊరి నుంచి వెళ్లి  మొగల్తూరులోని ఓ చర్చిలో 20వ తేదీ క్రిస్టియన్‌ మేరేజ్‌ చేసుకున్నారు. అనంతరం బందరు రూరల్‌ పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు.  

పట్టించుకోని పోలీసులు  
వధూవరులు సాయి, శోభన పోలీసులను ఆశ్రయించగా వారు ఇరువర్గాల పెద్దలను స్టేషన్‌కు రావాలంటూ ఆదేశించారు. అయితే ఇరుపక్షాల పెద్దలు రాకపోవడంతో పోలీసులు విషయం వదిలేశారు. నూతన జంట నందమూరులోని సాయి స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న శోభన కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం మధ్యాహ్నం నందమూరు చేరుకుని సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. శోభనను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. సాయిని బందరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ వ్యవహారంలో శోభన తరఫు బంధువైన మండల స్థాయి ప్రజాప్రతినిధి చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం సాగుతోంది. సాయిపై జరిగిన దాడికి బందరు రూరల్‌ పోలీసులు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందనే వాదన బాధితుడి బంధువుల నుంచి బలంగా వినబడుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top