పరీక్ష పేరుతో వైద్యమిత్రలకు అన్యాయం!

TDP Govt Plans To Remove NTR Arogya Mitras - Sakshi

ఆన్‌లైన్‌ పరీక్షలో 75 మార్కులు వస్తేనే కొనసాగింపు

ఎన్టీఆర్‌ వైద్యసేవా పథకంలో పనిచేస్తున్న వైద్యమిత్రలను తొలగించేందుకు ప్రభుత్వం సన్నద్ధ్ధమైంది. ఇందుకోసం వారికి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనుంది. ఆ పరీక్షలో 100కి 75మార్కులు సాధించిన వారినే ఉద్యోగంలో కొనసాగిస్తామని, లేకుంటే తొలగిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యమిత్రలంతా తమ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, నెల్లూరు(బారకాసు): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద అప్పట్లోనే వైద్య మిత్రలను నియమించారు. వీరందరూ ప్రభుత్వ వైద్యశాలలు, ఆరోగ్య కేంద్రాలలోతో పాటు ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ హాస్సిటల్స్‌లో పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 185 మందికి గాను ప్రస్తుతం 111 మంది విధులు నిర్వహిస్తున్నారు. అప్పట్లో ఏదైనా డిగ్రీ ఉండి కంప్యూటర్‌కు సంబంధించి కనీస పరీజ్ఞానం ఉంటే చాలని వీరందరినీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వీరంతా ఆరోగ్యశ్రీ కింద వైద్యమిత్రలుగా పనిచేస్తున్నారు.

2014లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం 2015లో జీఓ 28ని తీసుకొచ్చి ఆరోగ్య మిత్రలను తొలగించాలనే ప్రయత్నం చేసింది. తమ ఉద్యోగాలను కాపాడుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉద్యోగులంతా ప్రభుత్వ జారీ చేసిన జీఓ 28ని సవాల్‌ చేస్తూ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. కోర్టు వైద్యమిత్రలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా తీర్పు వైద్యమిత్రలకు అనుకూలంగా వచ్చింది. ఆయా విభాగాల్లోని వైద్యమిత్రలకు శిక్షణ ఇచ్చి అవసరమైతే పరీక్ష నిర్వహించుకోవాలని ఆ తీర్పులో కోర్టు సూచించింది.

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
సుప్రీం కోర్టు తీర్పును ఆసరగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ పూర్వకంగా ఇంగ్లిష్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష పెట్టి నూటికి 75 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాల్లో ఉంచాలని, ఆయా జిల్లాల కో–ఆర్డినేటర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌ అధికారుల అనాలోచిత నిర్ణయంపై వైద్యమిత్రలంతా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి కంప్యూటర్‌ పరిజ్ఞానం లేని తమకు ఇంగ్లిష్‌లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పుడే తమకు రాత పరీక్షపెడితే మళ్లీ ఇప్పుడు ఆన్‌లైన్‌ పరీక్ష పెట్టడం ఏమిటని వాపోతున్నారు.

కేవలం తమను ఉద్యోగాల్లో నుంచి తొలగించేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే 10ఏళ్ల నుంచి ఈ ఉద్యోగాలనే నమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకుంటూ జీవితం గడుపుతుంటే, ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని వారంతా అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం మేరకే జరిగితే 90 శాతం మంది ఉద్యోగాల్లోనుంచి తొలగించబడే అవకాశం ఉందని వాపోతున్నారు. దీంతో తమ కుటుంబాలన్నీ విధిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత పరీక్ష నిర్వహించాలి
కోర్టు ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహించాల్సిందే. అయితే ఆ న్‌లైన్‌ పరీక్ష కాకుండా రాత పరీ క్ష నిర్వహించాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేని మాకు ఆన్‌లైన్‌లో అది కూడా ఇంగ్లిష్‌లో పరీక్ష పెడితే ఎలా?.  
–పి.రాజేశ్వరి, వైద్యమిత్ర,కొడవలూరు పీహెచ్‌సీ

75 మార్కులు రావాలంటే పరీక్ష రాయం
ఎలాంటి పరీక్షకు కూడా వందకి 75 మార్కులు పాస్‌ అని లేదు. వందకి 35 వస్తేనే పాస్‌ అని అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మాకు పెట్టాలనుకునే పరీక్ష కూడా తెలుగులో రాత పరీక్ష నిర్వహించి వందకి 35 మార్కులు పాస్‌ అని అంటేనే పరీక్ష రాస్తాం. లేకుంటే రాయబోం.                  
–కె.హరిబాబు, వైద్యమిత్ర, జగదేవిపేట పీహెచ్‌సీ

ప్రభుత్వ సూచనలే పాటిస్తాం
వైద్య మిత్రలకు సంబంధించి ప్రభుత్వం ఏమైతే సూచనలు ఇస్తుందో ఆ మేరకే మేము పాటిస్తాం. మా సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు. వైద్యమిత్రల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
–డాక్టర్‌ దయాకర్, జిల్లాకో–ఆర్డినేటర్, ఎన్టీఆర్‌ వైద్యసేవా పథకం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top