రాజధాని ప్రాంతంలో బాబుగారి కొండచిలువ

TDP Govt Lands Corruption in Amaravati  - Sakshi

తనఖా భూములనూ మింగేస్తున్న లింగమనేని

ముఖ్యనేత, కీలక మంత్రి అండతో రెచ్చిపోతున్న రియల్‌ వ్యాపారి

బ్యాంకుల్లో తనఖాలో ఉన్న భూములే టార్గెట్‌

ఆ భూములను వేలం వేసేలా బ్యాంకర్లపై ఒత్తిడి 

నిబంధనలకు విరుద్ధంగా భూములు వేలం వేస్తున్న వైనం

తక్కువ ధరలకే లింగమనేనికి కట్టబెట్టడానికి స్కెచ్‌

సొమ్ము చెల్లిస్తామని రుణగ్రహీతలు చెబుతున్నా పెడచెవినే..

నాగార్జున వర్సిటీకి ఎదురుగా బ్యాంకు తనఖాలో ఉన్న 6.19 ఎకరాల భూమి ఇది. 
రాష్ట్ర విభజనకు ముందు 2014లో దీని విలువ రూ. 35.59 కోట్లుగా లెక్కకట్టారు. 
రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ భూమి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 102 కోట్లు 
కానీ ఈ స్థలాన్ని కేవలం రూ.33 కోట్లకే  కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది.
కొసమెరుపు: ఈ చిత్రంలోని బహుళ అంతస్తుల భవనాలు, ఐజేఎం– లింగమనేని.. రెయిన్‌ట్రీ పార్కుకు చెందినవి కావటం గమనార్హం.  

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజధాని ప్రాంతంలోని భూములను అధికారపార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు కొండచిలువల్లా మింగేస్తున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచీ వారు పేట్రేగిపోతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోతున్నారు. చిన్న, సన్నకారు రైతులు వద్ద నుంచి తీసుకున్న భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే ప్రధాన ధ్యేయంగా సాగిపోతున్న వారిలో ఇప్పుడు మరో కోణం బయటపడింది. పరోక్షంగా ముఖ్యనేత, ఓ కీలక మంత్రి.. ప్రత్యక్షంగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ లింగమనేని గ్రూప్‌ ఈ దందా కొనసాగిస్తోంది. తనఖాలో ఉన్న విలువైన భూములే లక్ష్యంగా ఎంపిక చేసుకుని, నయానో, భయానో, అధికార బలంతోనే వాటిని లాగేసుకుని తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. రాజధాని, విజయవాడ, గుంటూరు నగరాలకు సమీపంలో వాణిజ్య పరంగా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన భూములను చేజిక్కించుకోవడానికి బ్యాంకర్లను పావులుగా వాడుకుంటున్నారు. రుణం తీర్చేస్తామని తనఖా పెట్టిన వారు మొత్తుకుంటున్నా వినకుండా ఆ భూములను లింగమనేని అండ్‌కోకు తక్కువ ధరకే కట్టబెట్టేలా ప్రణాళికలు వేస్తున్నారు. దీనికోసం నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. 

తనఖాలోని భూములే లక్ష్యంగా..
బ్యాంకుల్లో రుణం తీసుకోవాలంటే ఆస్తులను తనఖా పెట్టాల్సిందేనన్న విషయం తెలిసిందే. గడువులోగా రుణం చెల్లించకపోతే బ్యాంకర్లు నోటీసులు ఇస్తారు. వాటికి స్పందించకపోతే ఆ రుణాన్ని నిరర్ధక ఆస్తి (ఎన్‌పీఏ)గా ప్రకటించి.. ఆస్తులను వేలం వేసి, వచ్చిన డబ్బులో తామిచ్చిన రుణాన్ని మినహామించుకుని మిగిలిన సొమ్మును తనఖా పెట్టిన వారికి ఇవ్వడం రివాజు. అయితే నోటీసులు ఇచ్చినప్పుడు రుణం తీసుకున్న వారు వడ్డీ చెల్లించినా, గడువు కోరినా, ఇతర సెక్యూరిటీలు చూపడానికి సిద్ధమైనా ఆస్తులను వేలం వేయకూడదు. అలాగే ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)కు రుణగ్రహీత సిద్ధపడితే ఆ అవకాశాన్ని కూడా పరిశీలించాలి. కానీ, రాజధాని ప్రాంతంలో విలువైన భూముల వేలం విషయంలో బ్యాంకర్లు నిబంధనలను పాటించడం లేదు. ఆ భూములను లింగమనేనికి కట్టబెట్టడానికే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యనేతతో పాటు లింగమనేనితో ఆర్థిక లావాదేవీలు ఉన్న ఓ మంత్రి కూడా ఒత్తిడి చేస్తుండటంతో బ్యాంకర్లు ఈ పనికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేలంలో తక్కువకు పాడినా.. 
వ్యాపార అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ 2014లో బంజరాహిల్స్‌లోని సిండికేట్‌ బ్యాంక్‌ను రుణం కోసం ఆశ్రయించింది. గుంటూరు జిల్లా చినకాకానిలో సర్వే నంబర్లు 230, 231ఏల్లో తనకున్న 3 ఎకరాల భూమిని ఆ కంపెనీ సెక్యూరిటీగా చూపింది. బ్యాంకు అధికారులు ఈ భూమి విలువను 2014 జూన్‌ 6న రూ.19.50 కోట్లు, అదే నెల 19న రూ. 20.25 కోట్లు, 2018 మార్చి 20న రూ. 24.75 కోట్లుగా అంచనా వేశారు. 2014 విలువ ఆధారంగా బ్యాంక్‌ అధికారులు రూ. 9 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. అయితే మార్కెట్‌ ఒడిదుడుకుల కారణంగా ఆ కంపెనీ వ్యాపారం సక్రమంగా సాగలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు రూ. 36.37 లక్షల వడ్డీని చెల్లించాలని కోరడంతో, ఆ కంపెనీ వెంటనే రూ. 20 లక్షలను బ్యాంకులో డిపాజిట్‌ చేసింది. తమ 3 ఎకరాల భూమి అభివృద్ధి నిమిత్తం మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, అప్పు మొత్తాన్ని త్వరలో చెల్లించేస్తామని బ్యాంకుకు తెలిపింది. ఈ భూమిపై లింగమనేని అండ్‌ కో కన్ను పడింది.

ఆ భూమికి పక్కనే లింగమనేని సంస్థకు పది ఎకరాల భూమి కూడా ఉంది. కంపెనీ భూమితో కలుపుకొని 13 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసి వందలాది కోట్ల రూపాయలు గడించడానికి ముఖ్యనేత, ఓ మంత్రితో లింగమనేని వ్యూహం రచించారు. అధికారంలోని ముఖ్య నేతలతో బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చారు. దీంతో నిబంధనలు తుంగలో తొక్కి బ్యాంకర్లు ఆ మూడు ఎకరాలను వేలం వేసేశారు. అయితే బ్యాంకుకు రావాల్సిన మొత్తం బకాయిల్ని రాబట్టుకునే ప్రయత్నాలు కూడా సజావుగా చేయలేదు. బ్యాంకుకు మొత్తం రూ.11.87 కోట్లు రావాల్సి ఉండగా, రూ.10.85 కోట్లకే వేలం పాడిన లింగమనేని అండ్‌ కోకి ఆ భూమిని కట్టబెట్టేశారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ. 50 కోట్లకుపైగా ఉంటుందని బ్యాంకు ఉద్యోగులే చెబుతుండటం గమనార్హం. దీనిపై డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ హైదరాబాద్‌లో పిటిషన్‌ దాఖలవ్వగా.. వేలం పాడిన వారు ఈ ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు జరపరాదనే ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. 

రుణం చెల్లిస్తామన్నా వేలమే..
హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ స్పిన్నింగ్‌ మిల్లు కొనుగోలు కోసం 2014లో సిండికేట్‌ బ్యాంకు, ఒంగోలు బ్రాంచ్‌లో రూ.31.75 కోట్ల రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇందుకు ప్రకాశం జిల్లా, దొడ్డవరప్పాడులోని 27.25 ఎకరాలను ప్రధాన హామీగా ఉంచింది. ఈ భూమి విలువను 2014లో రూ.26.01 కోట్లుగా, ప్లాంట్, మిషనరీని రూ.15 కోట్లుగా నిర్ణయించారు. అలాగే అదనపు హామీ (కొల్లేటరల్‌ సెక్యూరిటీ)గా గుంటూరు–విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా సర్వే నంబర్‌ 213/ఎ, 214లో ఉన్న 6.19 ఎకరాల భూమిని చూపారు. దీని విలువను బ్యాంకు 2014లో రాష్ట్ర విభజనకు ముందు రూ. 35.59 కోట్లుగా లెక్కగట్టింది. అలాగే రూ.13.13 కోట్లకు వ్యక్తిగత పూచీకత్తు, రూ.42 కోట్లకు కార్పొరేట్‌ గ్యారెంటీని కూడా కంపెనీ ఇచ్చింది.

రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ప్రాంతాన్ని ప్రకటించిన తరువాత అదనపు హామీగా ఉంచిన భూమి విలువ భారీగా పెరిగింది. 2015 జూన్‌లో ఆ భూమి విలువ రూ.75 కోట్లుగా అంచనా వేశారు. గతంలో విలువ నిర్ణయించిన వాల్యూయరే ఈ విలువను కూడా లెక్కగట్టారు. అయితే రుణ వాయిదాలను సక్రమంగా చెల్లించడంలేదంటూ 2016 ఫిబ్రవరి 18న కంపెనీకి సిండికేట్‌ బ్యాంక్‌ నోటీసులు జారీ చేసింది. ఆ రుణాన్ని నిరర్థక ఆస్తిగా పరిగణించింది. రుణం మొత్తాన్ని చెల్లించే స్థోమత తమకుందని చెప్పి రూ. 10 కోట్లు చెల్లించింది. మిగిలిన రుణం చెల్లించేందుకు కొంత గడువు ఇవ్వాలని బ్యాంకును కంపెనీ కోరింది. అయితే ఇక్కడ కూడా లింగమనేని అండ్‌ కో ఎంటరైంది. ఈ భూమికి రెండు వైపుల లింగమనేనికి భూములు ఉండటంతో తక్కువ ధరకే కంపెనీ భూములు కొట్టేసేందుకు ఎత్తు వేశారు.

లింగమనేనికి అండగా ముఖ్యనేత, ఓ మంత్రి రంగంలోకి దిగి ఆ భూమిని వేలం వేయాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రధాన ఆస్తితో పాటు అదనపు హామీగా ఉంచిన భూమి వేలానికి బ్యాంకు నిర్ణయం తీసుకుంది. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉన్న భూమి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.102 కోట్లు ఉండగా దానిని రూ. 33 కోట్లకే విక్రయించడానికి నిర్ణయించినట్లు బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. వాస్తవానికి వేలానికి ముందు సదరు ఆస్తి విలువను తప్పనిసరిగా మదింపు చేయాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంది. ఆ పని చేయకుండా అతి తక్కువ ధరకు లింగమనేనికే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. కాగా ప్రధాన హామీగా ఉంచిన ప్రకాశం జిల్లా, దొడ్డవరప్పాడులోని 27.25 ఎకరాలను, ప్లాంట్, మిషనరీ గురించి బ్యాంకర్లు దృష్టి సారించకపోవడం గమనార్హం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top