ప్రాజెక్టులను పట్టించుకోని సీఎం

tdp government neglect on irrigation projects - Sakshi

 జగన్‌ను సీఎం చేసుకుందాం.. సాగునీటిని తెచ్చుకుందాం  ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

దువ్వూరు (చాపాడు): సాగునీటి వనరులు ఉన్నప్పటికీ రాజోలి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడంతో రైతులు సాగునీటికి ఏటా ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై వివక్ష చూపుతున్నారని.. మన జిల్లా వాసి, ప్రతిపక్ష నేత అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సంపూర్ణంగా సాగునీటిని తెచ్చుకోవచ్చని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ఆరో రోజు ఆదివారం దువ్వూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కూడలిలో  బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీ ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు రాజోలి రిజర్వాయర్‌కు వైఎస్‌ఆర్‌ శంకుస్థాపన చేశారని, ఆయన మరణానంతరం పనుల గురించి సీఎం పట్టించుకోలేదన్నారు. దీని నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కా నాయకులకు పెత్తనాలు ఇచ్చాడని, అధికారులను డమ్మీలుగా చేశారన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు. 

అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేయటం న్యాయమే కదా..
ఎన్నికల్లో ఓడిపోయిన, పోటీ చేయని వ్యక్తులకు చంద్రబాబు మంత్రి పదువులు కట్టబెట్టారని, ఇదే క్రమంలో వైఎస్సార్‌సీపీలో గెలిచి సిగ్గు లేకుండా టీడీపీలోకి  వెళ్లిన వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వటం సమంజసమా అన్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద  ఫిర్యాదు చేసినా స్పీకర్‌ చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేయటం సమంజసమే కాదా అని రఘురామిరెడ్డి ప్రజలను అడిగారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, కోరుముట్ల శ్రీనివాసులు, పార్లమెంట్‌ కన్వీనర్లు అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే తనయులు ఎస్‌. నాగిరెడ్డి, ఎస్‌. శ్రీనివాసుల రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి రామచంద్రారెడ్డి,చాపాడు జెడ్పీటీసీలు బాలనరసింహారెడ్డి, చాపాడు, దువ్వూరు ఎంపీపీలు తెలిదెల వెంకటలక్షుమ్మ, కానాల చంద్రావతమ్మ,  శంకర్‌రెడ్డి, వీరనారాయణరెడ్డి, శ్రీమన్నారాయణరెడ్డి,  గోపిరెడ్డి ఓబుళ్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top