
ఇష్టారీతిన టీచర్లను మార్చేస్తున్న వైనం
సిఫారసు లేఖలున్నవారికి గుట్టుచప్పుడు కాకుండా బదిలీ
ఇప్పటికే 150 మందికి బదిలీ.. లైన్‌లో మరో 2 వేలమంది
గతంలో ఎన్నడూ లేనివిధంగా పోస్టులో ఉన్నవారిని తప్పించి మరీ పోస్టింగ్
కూటమి ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయసంఘాల ఆగ్రహం
మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ హైసూ్కల్లో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్న హెచ్‌ఎం వెంకటేశ్వరరావును బదిలీ చేసి తాడికొండ మండలం పొన్నెకల్లు జెడ్పీ హైసూ్కల్‌కి పంపించారు. ఆ స్థానంలో కృష్ణాజిల్లా పెనమలూరు జెడ్పీ హైసూ్కల్ గ్రేడ్–2 హెచ్‌ఎం దుర్గాభవానికి పోస్టింగ్ ఇచ్చారు. ఆదివారం సెలవు అయినప్పటికీ ఆమె నిడమర్రు స్కూల్‌కు వచ్చి బాధ్యతలు తీసుకున్నారు.
ఇదేమీ అంతర్ జిల్లా బదిలీ అనుకునేరు! కేవలం సిఫారసు లేఖతో జరిగిందే. ఇలా ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి సిఫారసు బదిలీలు చేసినట్టు సమాచారం. గతంలో సిఫారసు బదిలీలు జరిగినా ఖాళీస్థానాల్లో మాత్రమే అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా రెండున్నరేళ్ల సర్వీసు ఉన్నవారిని బలవంతంగా పంపించేసి తమకు కావాల్సిన వారికి పోస్టింగ్ ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు తెరతీశారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలు ఉన్నవారిని వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో మే/జూన్ నెలలో జరిగిన బదిలీల్లో వచ్చినవారిని సైతం బలవంతంగా మరోచోటుకు పంపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తాజాగా అన్ని జిల్లాల్లోను 150 మందికిపైగా ఉపాధ్యాయులను మార్చినట్టు తెలుస్తోంది. మరో 2 వేలమంది ఉపాధ్యాయులు తమ నియోజకవర్గ ముఖ్యనేతల లేఖలతో బదిలీకి సిద్ధంగా ఉన్నట్టు అంచనా.
తాజా బదిలీలు ఉపాధ్యాయ బదిలీ చట్టం మేరకే చేసినట్టు చెబుతున్నా.. పూర్తిగా సిఫారసు లేఖలు, నగదు కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏటా జూన్‌లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలుంటాయని, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పూర్తి పారదర్శకతతో బదిలీలు చేపపట్టేందుకు ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిప్రకారం ఈ ఏడాది ఉపాధ్యాయ బదిలీ చట్టం కూడా తీసుకొచ్చారు.
అయితే.. అవసరం అనుకుంటే ప్రభుత్వం ఎవరినైనా ఎప్పుడైనా బదిలీ చేయవచ్చన్న నిబంధన కూడా ఇందులో పొందుపరిచారు. దీని ఆధారంగానే కూటమి ప్రభుత్వం ‘సిఫారసు బదిలీ’లు చేపట్టినట్టు తెలుస్తోంది. నిడమర్రులో వెంకటేశ్వరరావు ఇంకా రెండున్నరేళ్లు పనిచేసే అవకాశం ఉన్నా బలవతంగా బదిలీచేసి, కృష్ణాజిల్లా టీచర్‌ను అక్కడ నియమించడంపై ఉపాధ్యాయసంఘాలు మండిపడుతున్నాయి.
బదిలీకి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు!
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉపాధ్యాయుల సిఫారసు బదిలీలకు రంగం సిద్ధం చేశారు. జిల్లాల నుంచి కూటమిలోని ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు కావాల్సిన టీచర్లకు, డబ్బులిచి్చన వారికి కోరుకున్న చోటుకు బదిలీ కోసం లేఖలిచ్చి సిఫారసు చేశారు. ఇలా దాదాపు రెండువేలకు పైగా దరఖాస్తులు విద్యాశాఖకు చేరినట్టు అంచనా. ఒక్కో బదిలీకి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయులే చెబుతున్నారు. అయితే.. వెంటనే బదిలీలు చేస్తే ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతుందని భావించిన ప్రభుత్వం.. సిఫారసు బదిలీలకు చట్టం ముసుగు వేసింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025’ చేసింది. ఇందులో సంవత్సరానికి ఒకసారి మాత్రమే బదిలీలుంటాయని చెబుతూ, అభ్యర్థన/పరస్పర/అంతర్ జిల్లా/అంతర్‌రాష్ట్ర బదిలీలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. అంటే సిఫారసు లేఖల కోసమే ఈ నిబంధన పెట్టినట్టు అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఆ నిబంధనను తొలగించాలని పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ నిబంధనే తమ నెత్తిన కుంపటిలా మారిందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో బదిలీపై కొత్త స్కూళ్లకు వెళ్లిన వారు సైతం ఎప్పుడు ఎవరి స్థానం మారుతుందోనని ఆందోళనగా ఉన్నట్లు తెలిసింది.