తిక్కారెడ్డి.. అదే వంకరబుద్ధి!

TDP candidate Tikkareddy Plitical Drama - Sakshi

బట్టబయలయిన టీడీపీ నేత బండారం

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి అదే వంకరబుద్ధి చూపుతున్నారు. ప్రజాభిమానం లేకపోవడంతో ఎన్నికల్లో గెలవలేనన్న ఉద్దేశంతో నాటకాలకు తెరలేపారు. అధికార తెలుగుదేశం పార్టీ తమకేమీ చేయలేదని ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న మంత్రాలయం మండలం కగ్గల్‌ గ్రామ ప్రజలను రెచ్చగొట్టి.. వారిపై అక్రమ కేసులను బనాయించడమే కాకుండా సొంతంగా దాడులు చేసుకుని సింపతీ కొట్టేసేందుకు పన్నాగం పన్నారు.

ఇందుకోసం ముందుగానే వేసుకున్న స్కెచ్‌ ప్రకారం వేటకొడవళ్లతో తనపై దాడి చేశారంటూ విషప్రచారానికి పూనుకున్నారు. అయితే.. చివరకు కొన్ని వీడియోలు బయటకు రావడంతో నాటు తుపాకీతో కాల్చారంటూ కొత్త నాటకానికి తెరతీశారు.  గ్రామంలో జరిగిన మొత్తం ఘటన వీడియో బయటకు వచ్చింది. గన్‌మెన్‌ ఫైరింగ్‌లోనే తిక్కారెడ్డికి గాయమైనట్టు తేలింది. దీంతో వేటకొడవళ్లు, నాటుతుపాకీ నాటకం కాస్తా తుస్సుమని తేలిపోయింది.  

ఏం జరిగింది?
మంత్రాలయం టీడీపీ టికెట్‌ ప్రకటించిన తర్వాత తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.  ప్రజల నుంచి అంతగా స్పందన కనిపించకపోవడంతో కొత్త నాటకానికి  తెరలేపారు. వాస్తవానికి కోసిగి మండలం ఐరన్‌గల్‌ గ్రామంలో ప్రచారానికి వెళుతున్నానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఇందుకు భిన్నంగా మంత్రాలయం మండలం కగ్గల్‌ గ్రామానికి వెళ్లారు. ఎంపిక చేసుకున్న అనుకూల మీడియా వారిని మాత్రమే వెంట తీసుకెళ్లారు. తమ గ్రామాన్ని కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం వస్తారా అని నిలదీసేందుకు గ్రామస్తులు సిద్ధం కావడంతో తిక్కారెడ్డి నాటకానికి తెరలేపారు. ముందే వేసుకున్న స్కెచ్‌ ప్రకారం తన సొంత గన్‌మెన్లు గాలిలోకి కాల్పులు జరిపారు.

ఇందులో మిస్‌ఫైర్‌ కావడంతో తిక్కారెడ్డికి కూడా గాయాలయ్యాయి. అయితే,  వేటకొడవళ్లతో దాడులు చేశారని మొదట్లో లీకులిచ్చిన తిక్కారెడ్డి..చివరకు ప్రైవేటు తుపాకీతో కాల్చారని కట్టుకథలు అల్లారు. అయితే.. అక్కడ ఉన్న కొద్ది మంది మొత్తం వ్యవహారాన్ని తమ సెల్‌ఫోన్ల ద్వారా రికార్డు చేయడంతో తిక్కారెడ్డి అసలు స్వరూపం బయటపడింది. ఆయనపై ఎవరూ దాడి చేయలేదని, గన్‌మెన్‌ ఫైరింగ్‌లోనే గాయాలయ్యాయని తేలిపోయింది.  గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా రాంపురం గ్రామానికి ప్రచారం పేరుతో వెళ్లి కట్టెలతో దాడులు చేశారంటూ నాటకాలు ఆడారు. అప్పుడు కట్టెలు... ఇప్పుడు వేటకొడవళ్లు, తుపాకీ అంటూ నాటకం మారిందని అక్కడి ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.  

అబద్ధాన్ని నిజం చేసేందుకు తాపత్రయం..
మంత్రాలయం నియోజకవర్గంలోని కగ్గల్‌ గ్రామంలో తనపై వేటకొడవళ్లతో, నాటు తుపాకులతో దాడి జరిగిందని నమ్మించేందుకు అధికారపార్టీ అభ్యర్థి తిక్కారెడ్డి తిప్పలు పడ్డారు. ఈ అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు వరుసగా సామాజిక మాధ్యమాల సాక్షిగా ప్రయత్నించారు. ఇక ‘ట్విట్టర్‌’ మంత్రి లోకేష్‌.. ‘ ప్రచారానికి వెళ్లిన వారిపై వైఎస్సార్‌ సీపీ వారు దాడిచేయడంతో టీడీపీ నేత తిక్కారెడ్డి ఏఎస్‌ఐ గాయపడ్డారు.. ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా వైసీపీ రౌడీలు కాలరాస్తున్నారు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మిగిలిన టీడీపీ నేతలు కూడా తిక్కారెడ్డిని చంపేందుకు ప్రయత్నించారంటూ తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేశారు. అయితే, మొత్తం ఘటనపై కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప..ఆదోని డీఎస్పీ వెంకటరాముడు ఆధ్వర్యంలో విచారణ జరిపించారు.

తీరా విచారణలో ప్రైవేట్‌ వ్యక్తులెవ్వరూ కాల్పులు జరపలేదని తేల్చారు. అంతేకాకుండా గన్‌మెన్లు అత్యుత్సాహం ప్రదర్శించి.. అవసరం లేనప్పటికీ కాల్పులు జరిపి క్రమశిక్షణ ఉల్లంఘించారని తేలింది. దీంతో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినందుకు గానూ ఇద్దరు గన్‌మెన్లు (ఎంసీ శ్రీనివాసులు, ఆర్‌ విజయ్‌కుమార్‌)ను ఎస్పీ సస్పెండ్‌ చేశారు. పోలీసుశాఖలో విధుల పట్ల అలసత్వం వహించి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప హెచ్చరించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top